
అన్యాయాన్ని సహించం
కార్యకర్తలను కాపాడుకుంటాం..
నెల్లూరు (సెంట్రల్): జిల్లాలో తమ కార్యకర్తల్లో ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగితే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో శనివారం సమావేశం నిర్వహించారు.
సర్వేపల్లి, సిటీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెల్లూరులోనే మొట్టమొదట కమిటీలు వేసి అధ్యక్షులను నియమించామన్నారు. వివిధ సంఘాలకు నియమితులైన అధ్యక్షులు కూడా కమిటీలు వేసుకోవాలని సూచించారు.
త్వరలో గ్రామస్థాయిలో అన్ని కమిటీ నియామకాలను పూర్తిచేసి జిల్లాలో వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛమైన నాయకులు, కార్యకర్తలతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు.
ఇటీవల ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టిన ధర్నాలే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసంతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటపై నిలబడే వ్యక్తి కాదని ప్రజలందరికీ అర్థమైందన్నారు. వృద్ధులని కూడా చూడకుండా పింఛన్లు తొలగిస్తున్నారని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనుబంధ సంఘాల అధ్యక్షులకు చాలా బాధ్యత ఉందని కాకాణి అన్నారు. అందరూ ఒకే తాటిపై పనిచేస్తూ భవిష్యత్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు జగన్‌తో పాటు పార్టీపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీని ఒక్కరు కూడా విడిచిపెట్టి పోరన్నారు.
రాబోవు రోజుల్లో జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగి 13 స్థానాలు ఏర్పడితే అన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డితో ఒక సారి స్నేహం చేసిన వాళ్లు జీవితంలో అతన్ని వదులుకోరన్నారు. కొందరు అధికారులు కూడా ఏకపక్షంగా పని చేస్తున్నారని కాకాణి విమర్శించారు. జిల్లాలో ఏ కార్యకర్తలకు కష్టమొచ్చినా అందరం వెళ్లి భరోసా ఇద్దామన్నారు.
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై అభిమానం ఎక్కువగా ఉన్నది నెల్లూరు జిల్లా వారికే అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో తమకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తామన్నారు. ఇప్పటి నుంచే అందరం కలిసి ఒకే ఆలోచనతో పార్టీని ముందుకు తీసుకెళదామన్నారు. రాబోవు ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని పిలుపునిచ్చారు. అధికార టీడీపీలో వాళ్లలో వాళ్లకే పడకుండా ఎవరికివారుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.