రైతు సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పంట చేతికి అందక, అప్పులు తీర్చలేక గ్రామాలు వదలి(వలస) వెళ్లిన రైతులు, ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో పేర్లుండి చనిపోయిన వారి పేర్లు తొలగించాలంటూ జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి.
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ :
రైతు సంక్షేమానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పంట చేతికి అందక, అప్పులు తీర్చలేక గ్రామాలు వదలి(వలస) వెళ్లిన రైతులు, ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో పేర్లుండి చనిపోయిన వారి పేర్లు తొలగించాలంటూ జిల్లా వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. అలాగే సాగుచేసిన భూమి కచ్చితంగా రైతు పేరుపైనే(ఇతరుల పేర్లుంటే తొలగించాలి) ఉండాలనే నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు డివిజన్, మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల పేర్లు తొలగించే పనిలో పడ్డారు.
నిధులు మిగల్చడానికేనా?
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తోంది. అయితే నిధులను మిగుల్చుకునేందుకు కిరణ్ సర్కార్ దొంగదారులు వెతుకుతోంది. జిల్లాలోని 33 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో 2013 ఖరీఫ్‌లో 1.58 లక్షల మంది రైతు లు 1.09 లక్షల హెక్టార్లలో సాగు చేసిన వేరుశెనగ పంట నష్టపోయారు. హెక్టారుకు *10 వేల చొప్పున పంట నష్టపరి హారం ఇవ్వాలని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. వలసవెళ్లిన, చనిపోయినవారు, భూమి తమ పేరుపై లేని రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలిచ్చింది. ఫలితంగా సుమారు 30 వేల మంది రైతులకు పరిహారం అందే పరిస్థితులు లేవని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. గత మూడేళ్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుల్లో చోటు చేసుకున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అధికారులు లెక్కలు కట్టినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తం గా వలస వెళ్లినవారు 3 నుంచి 5 వేల మంది రైతులు, 2 నుంచి 4 వేల మంది రైతులు చనిపోయి ఉంటారనే అంచనాకు వచ్చారు. మిగిలిన వారు ఎన్‌జాయ్‌మెంట్ సర్టిఫికెట్ (అనుభవ ధ్రువీకరణపత్రం) లేని రైతులు ఉండవచ్చు. ముత్తాతలు, తాతల పేర్లతో ఉన్న భూములను రైతులు తమపై మార్చుకోకుండా ఉన్నా వారి పేర్లనూ ఇన్‌పుట్ సబ్సిడీ జాబితా నుంచి తొలగించనున్నారు.
స్థానికంగా లేని రైతుల పేర్లు తొలగించమన్నారు
ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో పేర్లు ఉన్నా ఆ రైతులు స్థానికంగా లేకుంటే (వలస వెళ్లినవారు) వారి పేర్లు తొలగించమన్నారు. అదే విధంగా చనిపోయిన రైతులు, అనుభవంలో భూమి ఉన్నా రికార్డుల్లో వారి తాతలు, ముత్తాతల పేర్లు ఉన్నా సదరు రైతుల పేర్లు తొలగించడానికి పరిశీలించాలన్నారు.
- జె.రవికుమార్, జాయింట్ డెరైక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ