కెరీర్‌కు 'ఇన్‌స్పైర్‌' | Inspire Manak Internship Is For A Better Career | Sakshi
Sakshi News home page

కెరీర్‌కు 'ఇన్‌స్పైర్‌'

Published Thu, Jul 11 2019 9:37 AM | Last Updated on Thu, Jul 11 2019 9:37 AM

Inspire Manak Internship Is For A Better Career   - Sakshi

 సాక్షి, బాపట్ల:దేశంలో ప్రతిభకు కొదవలేదు. కోట్లాది మంది విద్యార్థుల్లో ఎందరో కలాంలు ఉన్నారు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కలలు కంటున్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిందే ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ)రూపొందించిన స్కీం ఇది. విద్యార్థులను సైన్స్‌ కెరీర్‌ వైపు మళ్లించడంతోపాటు పరిశోధనలకు ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2008లో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు  ‘ఇన్‌స్పైర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఇన్‌స్పైర్‌ మనక్‌తో ఏటా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థుల ప్రదర్శనలను తీసుకుంటుంది. ఆరో తరగతి నుంచి పీజీ వరకు విద్యాభివృద్ధి కోసం మూడు విభాగాల్లో ఐదు రకాల కార్యక్రమాలను అమలు చేస్తుంది. సైన్స్‌పై ఆసక్తి పెరిగేలా విద్యార్థుల్లో విజ్ఞాన సామర్థ్య వృద్ధికి డీఎస్‌టీ కృషి చేస్తోంది. ఇన్‌స్పైర్‌ మనక్, ఇన్‌స్పైర్‌ ఇంటర్న్‌షిప్‌లతో పాటు మూడు కేటగిరిల్లో పరిశోధనకు భరోసా కల్పిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జూలై 31తో ప్రాజెక్టుల నమోదు గడువు ముగియనుంది.

దరఖాస్తు అర్హత వివరాలు

  •  ఆరోవ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు  
  •  ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అర్హులు 
  •  ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు నామినేషన్లు పంపించాలి 
  •  మన చుట్టూ పరిసరాల్లో నెలకొన్న సామాజిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచనలతో ప్రాజెక్టు రూపొందించాలి  
  •  ప్రతిపాదనలను డీఎస్‌టీ పోర్టల్‌ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్‌.డీఎస్‌టీ.జీవోవీ.ఇన్‌)లో ఆప్‌లోడ్‌ చేయాలి
  •  ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి 
  •  జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. 
  •  జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టుల రూపకల్పనకు రూ.10 వేలను ప్రభుత్వం విద్యార్థికి అందజేస్తుంది. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపం ఇచ్చిన నమూనాలతో ప్రదర్శనలకు హాజరు కావాలి
  •  రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ప్రాజెక్ట్‌ రూపకల్పనకు ప్రభుత్వం రూ.20 వేలు అందజేస్తుంది 
  • 4 జాతీయ స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టు రూపకల్పనకు రూ. 50 వేలు అందిస్తుంది. 
  • 4 అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టు ఎంపికైతే పేటెంట్‌ హక్కులు లభిస్తాయి 

జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య

ప్రభుత్వ 2,78,040
ఎయిడెడ్‌  34,628
ప్రైవేటు  3,45,746

 విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం 
విద్యార్థుల ప్రతిభకు తగిన ప్రొత్సాహం లభిస్తుంది. సైన్స్‌ ఇన్‌స్పైర్‌ అవార్డులను ఆందుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. మా పాఠశాల నుంచి ప్రతి ఏడాది జిల్లాస్థాయికి ఎంపికవుతూనే ఉన్నారు. వీరితో పాటు 2013 డిసెంబర్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగిన  నేషనల్‌ చిల్ట్రన్‌ సైన్స్‌ సదస్సుకు మా పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొని గోల్డ్‌మెడల్స్‌ సాధించారు. దక్షిణభారత వైజ్ఞానిక ప్రదర్శనలో గతేడాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున ప్రథమ బహుమతి సాధించాం.  
                                                                     – జి. శ్రీనివాసరావు,  సైన్స్‌  టీచర్, చెరువుజమ్ములపాలెం 

జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒక పాఠశాల ఒకేసారి రిజస్టర్‌ చేయాలి. ఒకే యూజర్‌ ఐడీ, పాస్‌వార్డ్‌ రూపొందించుకుని ఉపయోగించాలి. విద్యార్థి పేరుతో బ్యాంకు ఖాతా ఉండాలి. మెయిల్‌ ఐడీలను పలుమార్లు ఉపయోగించినా విద్యార్థుల ఖాతాలోకి నగదు జమ కాదు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలి. 
                                                                      – ఎ.ఎ.మధుకుమార్, జిల్లా సైన్స్‌ అధికారి 

జిల్లాకు గుర్తింపు తెచ్చేలా కృషి 
జాతీయస్థాయిలో జిల్లాకు పేరు వచ్చేలా కృషి చేస్తున్నాం. గతేడాది గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,275 మంది అర్హత సాధిస్తే వారిలో 217 మంది జిల్లాస్థాయిలో ఎంపికయ్యారు. 22 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారిలో 03 జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. ఈ ఏడాది విద్యార్థులు తయారుచేసే ప్రతి ప్రాజెక్టు సృజనాత్మకంగా, నూతనంగా ఉండాలని సూచించాం. అందుకు అవసరమైన శిక్షణ సైన్స్‌ ఉపాధ్యాయులకు ఇప్పటికే ఇచ్చాం. 
                                                                              – ఆర్‌.ఎస్‌.గంగాభవాని, డీఈవో, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement