
యువజంట కోసం ముమ్మరంగా గాలింపు
- యాసిడ్ దాడి కేసులో దర్యాప్తు వేగవంతం
- రెండోరోజు పలువురిని విచారించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ సమీపంలో దంపతులపై యాసిడ్‌తో దాడి చేసి పరారైన యువజంట కోసం పోలీ సు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు నగరంలోని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూడా ఈ కేసును ముమ్మరంగా దర్యాపు చేస్తున్నారు. బైక్‌పై వచ్చిన యువకుడికి 30 ఏళ్లు, యువతికి 25 ఏళ్ల వయస్సు ఉంటుంది.
యువతి పంజాబ్ డ్రెస్ ధరించింది. వారు రింగుసర్కిల్ మీదుగా వచ్చి దాడి అనంతరం ఫెర్రి ఆర్టీసీ కాలనీ రోడ్డు మీదుగా ఇసుక రేవు డొంకరోడ్డులోకి వెళ్లి గాజుల పేట మీదుగా కీసరవైపు వెళ్లారని పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలిసింది. వారి ఆచూకీ కోసం కీసర టోల్‌గేట్ వద్ద వీడియో కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల పుటేజీని సేకరిస్తున్నట్లు సమాచారం.
మూడు కోణాల్లో దర్యాప్తు
ఈ కేసును పోలీసులు మూడు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దాడిలో గాయపడ్డ జూలూరి హనుమంతరావు మొద టి భార్య కుమారులు కుట్రపన్ని ఉంటారని ప్రధానంగా అనుమానించారు. మరి అంశా లపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హనుమంతరావు రెండో భార్య రమాదేవి, ఆమె తరఫు బంధువుల పాత్ర ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఎవరైనా శుత్రువులు ఉం డి ఉంటారా? అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు.
హనుమంతరావు వడ్డీలకు డబ్బు కూడా ఇస్తుంటారు. వడ్డీ వసూళ్ల విషయంలో ఒకరిద్దరితో మనస్పర్థలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలినట్లు తెలిసింది. తమ కుమారులే దాడి చేయించారని ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమారులు వాదిస్తున్నారు. హనుమంతరావు ఇంటిని పోలీసులు బుధవారం కూడా పరిశీలించారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు కుటుంబానికి సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి విచారిస్తున్నారు.
కోలుకుంటున్న రమాదేవి
దాడిలో తీవ్రంగా గాయపడిన రమాదేవి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్పొరేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. హనుమంతరావు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసును ఇబ్రహీంపట్నం సీఐ సీహెచ్ రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.