అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ | Inter-district thieves arrested in khammam district | Sakshi
Sakshi News home page

అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

Published Wed, Dec 4 2013 6:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతర్ జిల్లా దొంగలను ఖమ్మం డీఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ ఎవి.రంగనాథ్ తెలిపారు.

ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతర్ జిల్లా దొంగలను ఖమ్మం డీఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ ఎవి.రంగనాథ్ తెలిపారు. ఖమ్మం టూటౌన్  పోలీస్ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. చోరీలను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఖమ్మం డీఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలో సీఐ సారంగపాణి, గణేష్‌తో కూడిన బృందం.. ముగ్గురు పాత నేరస్తులను అరెస్టు చేసి వారి నుంచి 20లక్షల రూపాయల విలువైన 42 ద్విచక్ర వాహనాలు, బంగారం రికవరీ చేసినట్టు చెప్పారు. నల్గొండ జిల్లా చిలుకూరు మండలానికి చెందిన వేమూరి కృష్ణ, ఇల్లెందు సబ్ జైల్ బస్తీ ప్రాంతానికి చెందిన ఎల్లబోయిన కుమారస్వామి (కుమార్, కొమ్మి), అదే ప్రాంతానికి చెందిన గూడురు రాజేష్ ముఠాగా ఏర్పడి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్‌డీఓ.. జలసౌధ.. చిట్‌ఫండ్ తదితర ప్రభుత్వ-ప్రయివేటు కార్యాలయాల వద్ద ద్విచక్ర వాహనాలను  చోరీ చేసినట్టు చెప్పారు.
 
 పదేళ్లుగా దొంగతనాలు
 ఈ కేసులో అరెస్టయిన వేమూరి కృష్ణ.. ఖమ్మం, నల్గొండ, కృష్ణా, వరంగల్ జిల్లాల్లో గత పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడని, పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. జైలులో ఇతరులతో పరిచయాలు పెంచుకుని, వారు బయటకు వచ్చిన తరువాత మధ్యవర్తులుగా పెట్టుకుని చోరీ వాహనాలను అమ్మేవాడని చెప్పారు. ఈ చోరీ వాహనాలను కొనుగోలు చేసిన 14 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
 
 ప్రత్యేక బృందాలతో సత్ఫలితాలు
 జిల్లాలో చోరీలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో సత్ఫలితాలు వస్తున్నాయని, త్వరలో మరిన్ని రికవరీలు చూ పిస్తామని ఎస్పీ అన్నారు. గడిచిన ఆగస్టు నుంచి ఇప్పటివరకూ వాహన తనిఖీల్లో తగిన ధ్రువపత్రాలు లేని 72 వాహనాలను సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ రికవరీలో ప్రతిభ చూపిన సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు రివార్డులు ఇస్తామన్నారు. పనిచేయని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 వీరికి రివార్డులు
 రికవరీలో పాల్గొన్న టూటౌన్ సీఐ సారంగపాణి, ఎస్‌ఐలు శాం తన్, సత్యనారాయణ, సిబ్బంది లతీఫ్, లక్ష్మయ్య, మాగంటి శ్రీను, దాస్, త్రీ టౌన్ సీఐ గణేష్, సిబ్బంది బాబుజాన్, బాబు, ఎన్‌ఎస్.రాజు, రాజమౌళి, జనార్థన్, హరిలాల్, శ్రీనివాస్‌కు రివార్డులు ఇవ్వనున్నట్టు ఎస్పీ ప్రకటించారు.
 
 ఈ జాగ్రత్తలు పాటించాలి
 వాహనదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచిం చారు. వాహనానికి హ్యాండిల్ లాక్, వీల్ లాక్ అమర్చుకోవాలని చెప్పారు. సెకండ్ హ్యాండ్ వాహనం కొనేప్పుడు సంబంధిత ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైతే ఆర్‌టీఏ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు.
 
 సెకండ్‌హ్యాండువి కొంటే కష్టాలపాలే...
 దొంగలు చోరీచేసిన వాహనాలను ఎక్కువగా గ్రామీణ ప్రాం తాల్లో అమ్ముతున్నారని ఎస్పీ చెప్పారు. వీటిని కొన్నవారిపై, మధ్యవర్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 ‘నకిలీ’ ముఠాతో ‘ఆర్‌టీఏ’ హస్తం
 వాహనాల నకిలీ చాసిస్ నంబర్లు, ఆర్‌సీ పేపర్ల తయారీ ముఠాపై దృష్టి సారించినట్టు ఎస్పీ చెప్పారు. ఈ ముఠాను త్వర లో అరెస్టు చేస్తామన్నారు. ‘ఇందులో ఆర్‌టిఏ అధికారులు సైతం ఉన్నారు. వారిని కూడా వదిలేది లేదు’ అని ఎస్పీ తెలిపారు.
 
 విలేకరుల సమావేశంలో ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, ట్రైనీ డీఎస్పీ కె. నాగేశ్వరరావు, సీఐలు సారంగపాణి, గణేష్, వెంకటేష్, తిరుపతిరెడ్డి, రామోజీ రమేష్, ఎస్‌ఐలు శాంతన్, సత్యనారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement