అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఏడాది పరీక్షల సీజన్ నేటితో ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదటి సంవత్సరం బుధవారంతో మొదలుకానున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారంతో ప్రారంభమవుతాయి. జిల్లాలో మొత్తం 67,773 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అందులో ప్రథమ సంవత్సరం 34,500 మంది, ద్వితీయ సంవత్సరం 33,273 మంది విద్యార్థులు రాయనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ఇందుకోసం జిల్లా వ్యాప్తగా 99 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్‌ఐఓ వెంకటేశులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. గుంపులు గుంపులుగా కనిపిస్తే మాత్రం పోలీసులు తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తారని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో కరెంటు కోత విధించకుండా చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టరు ఇప్పటికే విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎట్టిపరిస్థితుల్లోనూ జిరాక్స్ కేంద్రాలు తీయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బస్సు సౌకర్యం లేని కేంద్రాలకు పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆర్‌ఐఓ వెంకటేశులు సూచిస్తున్నారు. 8.45 నుంచి 9 గంటల వరకు ఆలస్యంగా వచ్చేవారిని అనుమతిస్తారని, ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని స్పష్టం చేశారు. డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇన్విజిలేటర్లు గాని, విద్యార్థులు గాని సెల్‌ఫోన్లు తెచ్చుకోకూడదని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆయన దీవించారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published Wed, Mar 11 2015 2:49 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement