వీడిన సందిగ్ధం | Inter-science students practical tests midiyat | Sakshi
Sakshi News home page

వీడిన సందిగ్ధం

Published Thu, Jan 21 2016 3:29 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

Inter-science students practical tests midiyat

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  ఇంటర్ మీడియట్ సైన్సు విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు పాతపద్ధతిలో నిర్వహిస్తారా? లేదా ప్రకటించిన విధంగా జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించనున్నారా అన్న సందిగ్ధంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది తప్పనిసరిగా జంబ్లింగ్ పద్ధతిలోనే ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఎట్టకేలకు  ప్రకటించింది. గత  ఏడాది కూడా చివరి వరకు జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని చెప్పి ఆఖరికి పాత పద్ధతిలోనే నిర్వహించారు. ఈసారి కూడా అదే రీతిలో నిర్వహిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు.
 
 ఇప్పటికే పక్క రాష్ట్రమైన తెలంగాణలో పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారని, అదే తరహాలో ఇక్కడ వ్యవహరిస్తారని విద్యార్థులు ఆశిస్తున్నారు. కానీ, ప్రభుత్వం అందుకు భిన్నంగా జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు వృత్తి విద్యాశాఖాధికారులకు సూచన ప్రాయ ఆదేశాలతో స్పష్టత ఇచ్చింది.  ఫిబ్రవరి 4వ తేదీనుంచి 22 రోజుల పాటు 37కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని అంగీకరిస్తూ సదరు కేంద్రాల కళాశాలల ప్రిన్సిపాల్స్ దగ్గరి నుంచి జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారులు సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు. అకస్మిక తనిఖీల్లో తేడాలొస్తే చర్యలు తప్పవని డిక్లరేషన్ తీసుకున్నప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
 
 జిల్లాలో 13,400మంది సైన్సు విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.  జంబ్లింగ్ పద్ధతిని విద్యార్థులు దాదాపు వ్యతిరేకిస్తున్నారు.  ఇంకా వేచి చూడడం అనవసరమని భావించి వృత్తి విద్యాశాఖాధికారులు బుధవారం పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జంబ్లింగ్ పద్ధతిలోనే ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని, ఇప్పటికే విద్యార్థుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసిందని స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్రాక్టికల్స్‌కు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని అంగీకరిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. దీంతో అక్కడికక్కడే పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాల్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు.  
 
 కేంద్రాల్లో  సౌకర్యాలపై అనుమానాలు  
 జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు 37కేంద్రాలను గుర్తించారు. వాటిలో కొన్నింటికి ప్రాక్టికల్స్‌కు అవసరమైన పరికరాలు లేకపోవడంతో తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించే లోపు సరిచేసుకోవాలని, కొరత ఉన్న పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు వెసులుబాటు ఇచ్చారు. అయితే, కొన్ని కేంద్రాల్లో సరి చేసినప్పటికీ కొన్నిచోట్ల మాత్రం అధికారులకు నచ్చ చెప్పొచ్చని  పట్టనట్టు వ్యవహరించారు.  మరి, వీరిని దృష్టిలో ఉంచుకునో మరేంటో తెలియదు గాని వృత్తి విద్యాశాఖాధికారులు కూడా కాసింత వెసులుబాటు ఇచ్చారు. ఎక్కడైనా పరికరాలు పూర్తి స్థాయిలో లేకుంటే పక్కనున్న కేంద్రాల నుంచి తాత్కాలికంగా తెచ్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల సౌకర్యాలపై అనుమానాలు నెలకొన్నాయి.
 
 37 కేంద్రాల్లో పరీక్షలు
 ఇంటర్ సైన్సు ప్రాక్టికల్  పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలోనే జరగనున్నాయి. ఇప్పటికైతే ఇదే నిర్ణయం. 37కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నాం. సౌకర్యాల విషయంలో పూర్తిగా ఉన్నాయంటూ ప్రిన్సిపాల్స్ దగ్గరి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నాం. తేడాలుంటే డిక్లరేషన్ ఇచ్చిన వారిపై చర్యలు తప్పవు.                     - ఎం. స్వామినాయుడు,
 జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement