మెంటాడ: మండలంలోని జక్కువ గ్రామానికి చెందిన ఆర్నెపల్లి భారతి (8వ తరగతి) అనే విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై మృతిచెందింది. సంఘటనపై గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పొలంలో ఉన్న ఉల్లిపాయలు తడిసిపోతాయనే ఉద్దేశంతో మేనత్త రెడ్డి వరలక్ష్మి, పెదనాన్న రామునాయుడులతో కలిసి టార్పాలిన్ పట్టుకుని వెళ్తున్న సమయంలో సమీపంలో పిడుగుపడడంతో ఆ ధాటికి భారతి సృహ కోల్పోయింది. దీంతో మేనత్త, పెదనాన్న, పొలంలో ఉన్న మరికొంత మంది ఆమెను ఇంటికి తీసుకు వచ్చి, సపర్యలు చేశారు. అనంతరం ఆస్పత్రికి తీసుకువెళ్దామని సన్నద్ధమవుతుండగా ఆమె మృతి చెందింది.
బతుకు తెరువుకు తల్లిదండ్రుల వలస
భారతి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పెడిపునాయుడు, తవుడమ్మలు కూతురిని తాత, నాయనమ్మల దగ్గర ఉంచి వారు కూలిపనుల కోసం ఏలూరు వలసవెళ్లారు. మృతురాలు భారతికి తల్లిదండ్రులతో పాటు ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన అక్క వెంకటలక్ష్మి ఉన్నారు. విషయం తెలుకున్న తహశీల్దార్ పి. రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ బెల్లాన మోహనరావు, వీఆర్వో చింత పైడితల్లి గ్రామానికి వచ్చి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పిడుగు రూపంలో విద్యార్థి బలైపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని, వారు వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.
ప్రాణం తీసిన పిడుగు
Published Tue, Apr 5 2016 11:52 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement