మలేరియాతో విద్యార్థిని మృతి
Published Mon, Aug 19 2013 5:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
కొమరాడ, న్యూస్‌లైన్: కొమరాడ మండలంలోని గుమడ పంచాయతీ గుమడ అగ్రహారం గ్రామానికి చెందిన గులిపల్లి సిందూర(17) మలేరియా జ్వరంతో ఆదివారం సాయంత్రం మృతిచెందింది. వారం రోజునుంచి సిందూర మలేరియాతో బాధపడుతుండడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది.
గులిపల్లి శివున్నాయుడు, అప్పమ్మల ప్రథమ పుత్రిక సిందూర ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తమ్ముడు కిశోర్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. సిందూర మొదటినుంచి చదువుల్లో ప్రథమంగా నిలిచేది. పదోతరగతి పరీక్షల్లో, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రథమ శేణిలో ఉత్తీర్ణురాలైంది. ఇంటికి పెద్దదిక్కు అవుతుందని ఆశపెట్టుకున్న సిందూర తల్లిదండ్రులు ఆమె మృతితో తల్లడిల్లి పోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు.
పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణం
గ్రామంలో ఇంకా కొందరు జ్వరాల బారిన పడి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపమేనని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్నేళ్ల నుంచి పారిశుద్ధ్యనిర్వహణ చేపట్టకపోవడంతో వ్యర్థాలు కాలువల్లో పేరుకుపోవడంతో జ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
విషాదఛాయల్లో గ్రామం
సిందూర మృతితో గుడమ అగ్రహారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే సిందూర మరణ వార్త విని గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా సిందూర చదువులో ప్రథమంగా ఉండడంతో తోటి విద్యార్థులంతా ఆమె ఇంటికి వెళ్లే చదువుకునేవారు. దీంతో వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Advertisement
Advertisement