సాక్షి ప్రతినిధి, విజయనగరం :ప్రభుత్వం విధించిన సవాలక్ష నిబంధనలతో వేలాది మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు దూరమవుతున్నారు. నిబంధనల కారణంగా పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంత వరకూ ఏ పథకానికైనా లబ్ధిదారుని ఆధార్ నంబర్ మాత్రమే అడుగుతున్న ప్రభుత్వం, ఉపకార వేతనాలు పొందేందుకు మాత్రం తల్లిదండ్రుల ఆధార్‌ను కూడా అడుగుతుండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రుల్లో ఎవరికి ఆధార్ కార్డు లేకపోయినా దరఖాస్తులు అప్‌లోడ్ కావడం లేదు. ప్రభుత్వం విధించిన గడువు కూడా ఆదివారంతో ముగిసిపోతుండడంతో ఇక తమకు ఉపకార వేతనాలు అందే పరిస్థితి లేదని వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క చదువు కోసం తిరగాలా..? లేక ఈ సాంకేతిక నిబంధనలతో అప్‌లోడ్ కాని దరఖాస్తుల కోసం తిరగాలో తెలియక అవస్థలు పడుతున్నారు.
ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఆదివారంతో ముగియనుంది. కానీ కొత్తగా ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి అప్‌లోడ్ సమస్య గుదిబండగా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్ నమూనాలో పొందుపరిచిన ఇబ్బందికరమైన అంశాలే ఇందుకు కారణం. ఉపకార వేతనాలకు ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా నంబర్‌ను తప్పని సరిగా నమోదు చేయాలి. విద్యార్థితో పాటు అతని తల్లి, తండ్రి ఆధార్ కార్డు నంబర్ కూడా నమోదు చేయాలని సర్కార్ సూచించింది. ఇక్కడే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పేర్కొన్న ఏ కాలమ్ భర్తీ చేయకపోయినా దరఖాస్తు అప్‌లోడ్ కావడం లేదు. ఉదాహరణకు విద్యార్థి తండ్రో, తల్లో ఎప్పుడో చనిపోతే వారికి సంబంధించి ఆధార్ కార్డులుండవు. దాంతో కాలవ్‌ు ఖాళీగా ఉంచేస్తున్నారు. దీంతో తిరస్కరణకు గురై ఆన్‌లైన్‌లో దరఖాస్తు అప్‌లోడ్ కావడం లేదు. అలాగే, బ్యాంకు ఖాతా తెరవని విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఈబీసీ విద్యార్థులది మరో సమస్య
ఈబీసీ విద్యార్థులు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఈ సేవా ద్వారా కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి సీసీజీ నంబర్ పొందుతున్నారు. ఆ నంబర్ని ఆన్‌లైన్ కాలమ్‌లో నమోదు చేయడంతో అప్‌లోడ్ అయిపోతోంది. కానీ ఈబీసీ విద్యార్థులకు ఈసేవా ద్వారా సీసీజీ నంబర్లు ఇవ్వడం లేదు. దీంతో ఆ విద్యార్థులంతా సీసీజీ కాలంలో ఎటువంటి నంబర్ నమోదు చేయకపోవడంతో అప్‌లోడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణాలేదైతేనేమి ప్రభుత్వం నిర్ధేశించిన నవంబర్ 30వ తేదీ తుది గడువులోగా అర్హులైన విద్యార్థులంతా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆఖరి గడువని వదిలేస్తే వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు దూరమవుతారు.
ఒక్కొక్క కేటగిరీలో అప్‌లోడైన దరఖాస్తులు ఇలా ఉన్నాయి.
ఎస్సీ కేటగిరీలో
పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం 3,430 మంది విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాగా, ఇప్పటి వరకు 1,332మంది మాత్రమే నమోదు చేసుకోగలిగారు. మిగతా 2,100 మంది అయోమయంలో పడ్డారు. ఇక రెన్యువల్ విద్యార్థుల విషయానికొస్తే 3,979 మందికి గాను 3,592 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయగలిగారు.
ఎస్సీ ప్రీమెట్రిక్(5నుంచి 10వ తరగతి) స్కాలర్‌షిప్‌ల కోసం కొత్త, రెన్యువల్ కింద ఎని మిది వేల మంది విద్యార్థులు అర్హులు కాగా, ఇప్పటివరకు కేవలం 1,800మంది విద్యార్థులు మాత్రమే అప్‌లోడ్ చేయగలిగారు. మిగతా వారంతా సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ లెక్కన సుమారు ఆరువేల మంది స్కాలర్‌షిప్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
బీసీ కేటగిరీలో...
పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం 35వేల మంది విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాగా, ఇప్పటివరకు 11,148మంది మాత్రమే అప్‌లోడ్ చేయగలిగారు. సుమారు 24వేల మంది సాంకేతిక సమస్యలతో అప్‌లోడ్ చేసుకోలేక మిగిలిపోయారు. వీరంతా స్కాలర్‌షిప్‌కు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బీసీ పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యువల్ విషయంలో కాస్త మెరుగ్గానే ఉంది. 32వేల మందికి గాను దాదాపు 31వేల మంది అప్‌లోడ్ చేయగలిగారు.
బీసీ ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అర్హులైన విద్యార్థులలో ఇప్పటివరకు 30 శాతం మంది మాత్రమే అప్‌లోడ్ చేయగలిగారని సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 70 శాతం మంది స్కాలర్‌షిప్‌కు దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఇదే తరహాలో ఎస్టీ విద్యార్థులు కూడా అప్‌లోడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు అప్‌లోడైన అంకెలు చూస్తే జిల్లాలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లను కోల్పోయే పరిస్థితి కన్పిస్తోంది. అప్‌లోడైన అంకెలను దృష్టిలో ఉంచుకుని గడువు తేదీ పెంచమని ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఇప్పటివరకు స్పందన రాలేదు. అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా, ఈబీసీ విద్యార్థుల సీసీజీ నంబర్ కాలమ్‌ల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఉపకారానికి అప్‌కారం
Published Sun, Nov 30 2014 3:00 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement
Advertisement