ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్:జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగి శాయి. వాస్తవానికి గతనెల 25 నుంచి జరిగిన ఈ పరీక్షలు వాస్తవానికి జూన్ ఒకటితోనే ముగియూల్సి ఉంది. అయితే, గతనెల 29వ తేదీన తెలంగాణాలో బంద్ కారణంగా ఆరోజు జరగాల్సిన పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు 3వ తేదీన నిర్వహించింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు మొత్తం 60 కేంద్రాల్లో జరిగాయి.
మేథ్స్ 1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సెట్-3 పేపర్‌తో విద్యార్థులు పరీక్ష రాశారు. జనరల్ విభాగానికి 10,911 మంది హాజరుకావాల్సి ఉండగా 691 మంది, ఒకేషనల్‌కు 91 మంది హాజరుకావాల్సి ఉండగా 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు 55 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. మాథ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సెట్-2 ప్రశ్నపత్రంతో విద్యార్థులు పరీక్ష రాయగా... జనరల్ విభాగంలో 2,783 మంది విద్యార్థులకు 152 మంది, ఒకేషనల్‌కు 48 మందికి ఇద్దరు గైర్హాజరయ్యారు. మొత్తంమీద ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అన్ని విభాగాలకు కలిపి 854 మంది డుమ్మా కొట్టినట్లు అధికారులు ధ్రువీకరించారు.
మాల్‌ప్రాక్టీసులు నిల్..
ఇదిలా ఉండగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసు కూడా నమోదుకాలేదు. గత ఐదేళ్ల తరువాత సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీసులు నమోదుకాకపోవడం ఇదే తొలిసారని పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో పది మంది విద్యార్థుల్లోపే పరీక్షలు రాశారు. ఈ సారి నేల రాతలు జరిగితే ఉపేక్షించేది లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అధికారులు ఆచరణలో విఫలమయ్యూరు. కింతలి, పొందూరు, పాతపట్నం, జలుమూరు, టెక్కలి, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లోని కళాశాలల్లో నేల రాతలు జరిగినా అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు.