విజయనగరం అర్బన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో అక్రమాలకు తావివ్వకుండా పరీక్ష కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా జిల్లాలో సాలూరు మండలం పి.కోనవలస ఏపీటీడబ్ల్యూ గురుకుల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11 నుంచి మొదటి సంవత్సరం, 12 నుంచి రెండో సంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు విధిగా 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి. కనీసం 15 నిమిషాల ముందు హాజరుకాకపోతే అనుమతించరు. 31వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు జిల్లాలో 46,839 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 23,040 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23,799 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 170 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అనుకూలంగా ఉన్న 68 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారి చొప్పున ఇద్దరు అధికారులు పూర్తిస్థాయి నిర్వాహణ బాధ్యత తీసుకుంటారు. జిల్లాలోని ప్రైవేటు కళాశాల పరీక్ష కేంద్రాల్లో అదనంగా మరో సహాయ సీఎస్‌ను ఏర్పాటు చేస్తారు. రోజూ ఉదయం 09.00 నుంచి 12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల్లో ఫర్నీచరు, తాగునీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
పదిరోజుల కిందటే వచ్చిన ప్రశ్నపత్రాలను ఇంటర్మీడియెట్ తనిఖీ అధికారి కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. హాల్ టిక్కెట్లను కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలకు బుధవారం నుంచి అందజేస్తున్నారు. హాల్ టిక్కెట్‌లో ఏవైనా తప్పులుంటే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా ఆర్‌ఐఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే బోర్డుకు పంపి సవరణలు చేయిస్తామని ఆర్‌ఐఓ ఎల్‌ఆర్ బాబాజీ తెలిపారు. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులతో చర్చిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్ నిరోధానికి ముగ్గురేసి సభ్యులున్న మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఇద్దరేసి సభ్యులున్న ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌ల బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు కనీస (కనీసం) 11 మంది ఇన్విజిలేటర్లు విధులను నిర్వహిస్తారని తెలిపారు.
ఈ ఏడాది కూడా ‘జీపీఎస్’ అమలు
ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులకు ఇంటర్మీయెట్ మార్కులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఏడాది మాల్‌ప్రాక్టీస్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు బోర్డు ప్రతిసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేసిన వినూత్న పద్ధతులు ఫలితాలను ఇచ్చాయి. పరీక్ష కేంద్రాల పరిధిలోని సెల్‌ఫోన్ కాల్స్‌పై దృష్టిసారించేందుకు నూతన టెక్నాలజీ గ్లోబెల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్) ను ఇంటర్ బోర్డు గత ఏడాది అమలు చేసింది. ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. జీపీఎస్ టెక్నాలజీ వినియోగం వల్ల సంబంధిత పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్, బ్లూటూత్ వంటివి ఎవరు వినియోగించినా బోర్డు ఉన్నతాధికారులు గుర్తించ వచ్చు. పరీక్ష కేంద్రాలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టు మెంటల్ అధికారుల మినహా ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్‌ఫోన్‌లు వినియోగించడానికి వీలులేదు. కార్పొరేట్ కళాశాలల్లో అధికశాతం మాల్‌ప్రాక్టీస్ కేసులు ఎదురవడం వల్ల ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థికిచ్చిన జవాబు బుక్‌లెట్ 24 పేజీలున్నాయో లేదోచూసుకోవాలి.
పరీక్షకేంద్రానికి 30 నిముషాల ముందు హాజరవ్వాలి. కనీసం 15 నిముషాలు ముందు రావాలి. ఈ సమయం దాటితే పరీక్షకు అనుమతి ఇవ్వరు.
అంధ విద్యార్థికి స్కైబ్ (సహాయకుడు) అర్హత డిగ్రీ చదువుతో సమానంగా ఉండాలి. సంబంధిత కోర్సులు చదివి ఉండకూడదు.
ఓఎంఆర్ బార్‌కోడెడ్ షీటులోని పార్టు-3లో అభ్యర్థి ఏమైనా మార్పులు చేసినట్లయితే పబ్లిక్ పరీక్షలలో అనుచిత ప్రవర్తనగా పరిగణిస్తారు.
సెల్‌ఫోన్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు
30 నిమిషాల ముందే హాజరుకావాలి
Published Tue, Mar 10 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement