అమ్మాయిలే ఫస్ట్ | intermediate exams results womens top in kurnool district | Sakshi
Sakshi News home page

అమ్మాయిలే ఫస్ట్

Published Sun, May 4 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

intermediate exams results womens top in kurnool district

కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయభేరి మోగించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో మూడు నెలలు చదువుకు అంతరాయం కలిగినా మొక్కవోని దీక్షతో మెరుగైన ఫలితాలు సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం అధికంగా 66.85 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. జిల్లాలో ఈ ఏడాది 30,341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 20,122 మంది ఉత్తర్ణులు కావడంతో రాష్ట్రంలో జిల్లాకు ఏడవ స్థానం దక్కింది. 61 శాతం ఉత్తీర్ణతతో గత ఏడాది జిల్లా 9వ స్థానంలో నిలిచింది.
 
 ఈ ఏడాది బాలురు 16,751 మంది పరీక్ష రాయగా 10,374 మంది.. బాలికలు 13,590 మంది పరీక్ష రాయగా 9,748 మంది ఉత్తీర్ణులై పైచేయి సాధించారు. ఓకేషనల్ కోర్సులో 2,794 మందికి గాను 1,936 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 7,023 మంది విద్యార్థుల్లో 4,556 మంది (65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 3,829 మందికి గాను 2,440 (63.72 శాతం), బాలికలు 3,194 మందికి గాను 2,116 (66.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కాలేజీల్లో 1,822 మందికి గాను 972 మంది (53 శాతం) ఉత్తీర్ణులవగా.. బాలురు 470 (47.05 శాతం), బాలికలు 502 (61 శాతం) మంది ఉత్తీర్ణత నమోదు చేసుకున్నారు. వొకేషనల్ ఎయిడెడ్ కాలేజీల్లో మొత్తం 259 మందికి గాను 175 మంది (68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ వొకేషనల్ కాలేజీల్లో 1,480 మందికి గాను 1,217 మంది (82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అన్ని విభాగాలు, బ్రాంచ్‌లు, మేనేజ్‌మెంట్‌లలో బాలుర కన్నా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులవడం విశేషం.
 
 సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
 ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబర్చాయి. సాధారణ విద్యార్థులతో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు మెరుగైన ఫలితాలు నమోదు చేసుకున్నాయి. పాములపాడు జూనియర్ కళాశాల 98.90 శాతం, కోసిగి 92.68 శాతం, గోనెగండ్ల కళాశాల 89.07 శాతం, కోయిలకుంట్ల 87.85 శాతం, బండిఆత్మకూరు కళాశాల 84.52 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ కాలేజీల్లో బేతంచర్లలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల 69.61 శాతం, కర్నూలులోని సెయింట్‌జోసఫ్స్ జూనియర్ కళాశాల 64.73 శాతం, చాగలమర్రిలోని ఎస్‌వీఎంవీఎస్‌ఆర్ కళాశాల 63.57 శాతం ఉత్తీర్ణత దక్కించుకున్నాయి.

 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల హవా
 ఇంటర్ ఫలితాల్లో మరోసారి కార్పొరేట్, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు ఎంపీసీలో ఆర్.మౌనిక, ఎ.హరీష్ 985, ఎం.నాగమహతి 983, బి.కావ్య 982 మార్కులు, బైపీసీలో ఆర్.కీర్తన 984, పి.ఫాతిమా 983, జి.దివ్య 982, జి.షైని ప్రియాంక 980 మార్కులు సాధించారు.
 
 ఎంపీసీ విభాగంలో నారాయణ కళాశాలకు చెందిన ఎ.సుష్మిత 987, కె.వంశీకృష్ణ 986, జి.రాగశ్రీ, అప్షాన్ జబీన్‌షేక్ 985, పి.శ్రావ్య, జె.సుమశ్రీ, కె.సాగరిక 983, ఎం.శ్రీహర్ష 982, వై.సమీనాబాను, వి.సాయి ఐశ్వరయ్య, పి.అరవిందకుమార్‌రెడ్డి, కె.భారతి 981 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్.జువేరియా 987, బి.సాయిస్నిగ్దారెడ్డి, నిలోఫర్ ఉన్నీసా 984, శ్రీనాథ్‌రెడ్డి 982, ఎం.సంహిత, ఎన్.తహ్మినదలియా 980 మార్కులతో ప్రతిభ కనబరిచారు. శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలకు చెందిన టి.చైత్ర ఎంపీసీలో 980 మార్కులు సాధించగా.. ఎంఈసీలో మాస్టర్స్ మైండ్స్ కళాశాల విద్యార్థిని ఎ.అనూష 981 మార్కులు దక్కించుకున్నారు. కర్నూలులోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిని ఎన్.మౌనిక 984 మార్కులు సాధించారు.
 
 25 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
 ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని ఆర్‌ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు రూ.290, దరఖాస్తు రూ.10లతో కలిపి మొత్తం రూ.300 చెల్లించాలన్నారు. రీ వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు ప్రతి పేపర్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement