మిషన్ సుబ్బారావు మనుమడు అని పిలుస్తారు
కిక్ ఇచ్చే పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పిస్తేనే నటుడికి గుర్తింపు లభిస్తుందని సినీ క్యారెక్టర్ నటుడు సుబ్బరాజు అన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో విలేకరులతో ముచ్చటించారు.
మీ స్వస్థలం
విశాఖపట్నం సమీపంలోని లింగరాజుపాలెం
మీ సినీరంగ ప్రవేశం
పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీతో పరిచయమైంది. కర్ణ సినిమాలో ఆయన నాకు టైస్ట్ పాత్ర ఇచ్చారు. దీంతో గుర్తింపు లభించింది. తర్వాత కొంతకాలం ప్రతినాయకుడు పాత్రలతో మెప్పించాను. ఇప్పటి వరకు 200 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించాను.
మీకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు
‘అమ్మా.. నాన్న.. ఓ తమిళమ్మాయి’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆర్య, పోకిరి, బుజ్జిగాడు, ఖలేజా సినిమాల్లో పాత్రలకు బాగా గుర్తింపు వచ్చింది. మిర్చీలో పాత్ర మరో బ్రేక్ ఇచ్చింది.
కేవలం ప్రతి నాయకుడి పాత్రలే మీరు చేస్తున్నారెందుకు..
నాకు నటనంటే చాలా ఇష్టం. అలాగని హీరో పాత్ర చేయాలని లేదు. అయితే ఎన్నో పాజిటివ్ రోల్స్ కూడా చేశా. హీరో ఒక్క సినిమా చేసే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాలుగైదు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.
మీ సినీరంగ ప్రవేశంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..
మా తాత మిషన్ సుబ్బారావు అంటే మా ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. నన్ను మిషన్ సుబ్బారావు మనుమడిగా పిలుస్తారు. నా తండ్రి రామకృష్ణంరాజు, అలాగే సోదరుడు కళాశాలల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. నా తల్లి గృహిణి. చిన్ననాటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తిని గుర్తించిన మా కుటుంబం ఈ రంగంలోకి వచ్చేందుకు ప్రోత్సహించింది.
మీకు నచ్చిన నటులు..
పాతతరంలో భానుమతి అంటే చాలా ఇష్టం. మా కుటుంబ సభ్యులకు సైతం ఆమె నటనంటే చాలా మక్కువ. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పలువురి నటన నన్ను ఆకట్టుకుంటోంది.