సీఐలపై నిఘా !
సీఐలపై
నిఘా !
రేంజి ఐజీగా పీవీ సునీల్‌కుమార్ ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించాయి.సివిల్ వివాదంలో తలదూర్చిన ఒక డీఎస్పీ సహా ఇద్దరు సీఐలు, ఓ ఎస్‌ఐను సస్పెండ్ చేయడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరో సీఐపై వేటు వేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఓ పేకాట క్లబ్‌కు సంబంధించి పైరవీ చేయబోయిన కొందరు పెద్దలకు ‘ప్రత్యేక కౌన్సెలింగ్’ చేసి పంపిన ఆయన అక్రమ మార్గాల్లో నడుస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై నిఘా వేయడం తాజాగా చర్చనీయాంశమైంది.
సాక్షి, గుంటూరు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ఐజీ సునీల్‌కుమార్ అవినీతి ఆరోపణలు వచ్చిన సీఐలను వీఆర్‌కు పంపి ఆయా స్టేషన్లలో రికార్డుల నిర్వహణపై విచారణ చేయిస్తున్నారు. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ ప్రక్రియ అనంతరం అవకతవకలకు పాల్పడిన సీఐలైపై చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఐజీ తాజాగా చేపట్టిన రికార్డుల విచారణ సమాచారం బయటకు పొక్కడంతో సీఐలు తలలుపట్టుకుంటున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని కొన్ని స్టేషన్‌లలో రికార్డులు తారుమారుపై ఉన్నతాధికారులకు సమాచారం అందింది. డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ మార్గంలో కేసులు మాఫీచేయడం, దర్యాప్తును మూలనపడేయడం, డీఎస్పీలకు సమాచారం లేకుండానే రికార్డులను పాత సంవత్సరాల జాబితాల్లో పెట్టడం, ఒక కేసులో ఆధారాలు వేరొక కేసుఫైలులో ఉంచడం తదితర ‘తప్పు’లను విచారణ అధికారులు బయటపెడుతున్నారు.
గుంటూరు వెస్ట్ సర్కిల్ డీఎస్పీగా మొన్నటివరకు పనిచేసిన కె. లావణ్యలక్ష్మి రెండు వారాల కిందట తానే స్వయంగా పలు పోలీసుస్టేషన్‌లలో 2004 నుంచి రికార్డులను బయటకు తీయించి పరిశీలించారు. ఆమె పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం స్టేషన్‌లలో పలు కేసుల్లో కీలక డాక్యుమెంట్లుపై పూర్వ సీఐలను విచారించాల్సిందిగా ఐజీకి నివేదిక పంపినట్లు సమాచారం.
మిస్సింగ్ కేసులుపై ఆరా... గతంలో స్టేషన్‌కొచ్చిన మిస్సింగ్ కేసులు ఫిర్యాదులపై పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవారు కాదు. మూడు నాలుగేళ్లుగా స్టేషన్‌లకు అందిన మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీసులు ఏ చర్యలు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తులు దొరికారా.. లేదా.. అని అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో స్టేషన్ సిబ్బంది మిస్సింగ్ కేసులు ఫైళ్లు బూజుదులిపి బాధితులకు ఫోన్‌లు చేసి స్టేషన్‌లకు రావాలని బతిమాలుతున్నారు.