పొదుపు మహిళలకు వడ్డింపు | intrest for The savings a woman | Sakshi
Sakshi News home page

పొదుపు మహిళలకు వడ్డింపు

Published Mon, Jul 7 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

పొదుపు మహిళలకు వడ్డింపు

పొదుపు మహిళలకు వడ్డింపు

- స్త్రీ నిధి రుణాలకు వడ్డీ కట్టాలని ప్రభుత్వ ఆదేశం
- ఇప్పటిదాకా ఆ భారం మోయని మహిళలు
- సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం
- కట్టిన వడ్డీ ఖాతాల్లో ఎప్పుడో జమ అవుతుందంట?

 అద్దంకి : స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో స్త్రీనిధి బ్యాంకులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం ఇచ్చే సదుపాయం ఉంది. అర్హత కలిగిన మహిళ తన సెల్‌ఫోన్ ద్వారా రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా అవసరమైన మేరకు వడ్డీలేని రుణం మంజూరయ్యేది. నెలా నెలా అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోయేది. ఇక నుంచి అలా కుదరదు. వడ్డీ కూడా రుణగ్రహీతలే చెల్లించాలి.
 
నియోజకవర్గంలో రూ.11.70 కోట్ల రుణాలు

అద్దంకి నియోజకవర్గంలోని పొదుపు మహిళలు స్త్రీనిధి రుణాల కింద సుమారు రూ.11.70 కోట్లు తీసుకున్నారు. సంతమాగులూరు మండలంలో రూ.2.50కోట్లు అద్దంకి మండలంలో రూ.3.20కోట్లు, బల్లికురవ మండలంలో రూ. 1.50కోట్లు, కొరిశపాడు మండలంలో రూ.2 కోట్లు, పంగులూరు రూ.2.50 కోట్లు స్వయం సహాయక సంఘ మహిళలకు రుణంగా ఇచ్చారు.
 
14 శాతం వడ్డీ కట్టాల్సిందే..

స్త్రీ నిధి రుణాలు తీసుకున్న మహిళలు వాయిదాలు చెల్లించే సమయంలో అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మేరకు ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌కు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు ఆదేశాలు వచ్చాయి. స్త్రీ నిధి అధికారిక వెబ్‌సైట్లో కూడా వడ్డీ కట్టాల్సిన సమాచారాన్ని పొందుపరిచారు.
 
మహిళల్లో ఆగ్రహం
ప్రభుత్వం తమ డ్వాక్రా రుణాలు మాఫీ చేసి బతుకులు బాగు చేస్తుందనుకుంటే.. స్త్రీనిధి రుణాలపై వ డ్డీ కట్టాలని చెప్పడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం ఘంటా శ్రీనివాసరావును వివరణ కోరగా స్త్రీ నిధి రుణాలకు వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఇక నుంచి చెల్లించాల్సిన రుణ వాయిదాలతోపాటు వడ్డీ కూడా చెల్లించాలి.
 
ఆ బాధ్యత నుంచి తప్పుకునేందుకేనా?

అధికారం వచ్చి నెల రోజులైనా డ్వాక్రా రుణాల మాఫీపై ఎటూ తేల్చని టీడీపీ ప్రభుత్వం   స్త్రీనిధి రుణ  బకాయిలకు 14 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆ వడ్డీని ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. జూలై ఒకటి నుంచి అసలుతోపాటు వడ్డీ కూడా సంఘాల మహిళలే చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. బ్యాంక్ లింకేజి వచ్చినప్పుడు సంబంధిత నగదు వారికి జమ అవుతుందని చెబుతున్నప్పటికీ ఎప్పట్లోగా చెల్లిస్తామన్న హామీ మాత్రం ఇవ్వడం లేదు. దీనిని బట్టిచూస్తే పథకం అమలు బాధ్యతల నుంచి ప్రభుత్వం తిన్నగా తప్పుకోవాలనే యోచన కనిపిస్తోందని పొదుపు మహిళలు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement