1967-69 తెలంగాణ ఉద్యమ సమయం లో, 1971-72 జైఆంధ్ర ఉద్యమ సమయంలో సీమాం ధ్రులు హైదరాబాద్ గురించి మాట్లాడలేదని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : 1967-69 తెలంగాణ ఉద్యమ సమయం లో, 1971-72 జైఆంధ్ర ఉద్యమ సమయంలో సీమాం ధ్రులు హైదరాబాద్ గురించి మాట్లాడలేదని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. 1972 తర్వాత ముల్కీ రూల్స్, తెలంగాణ రీజినల్ కమిటీలను తొలగించిన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక వారి బలం మరింత పెరిగిందన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌లోని భూములను ఆక్రమిం చడం మొదలు పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టైతే ఆ భూములపై హక్కు వదులుకోవాల్సి వస్తుందని భయపడి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి న మూనా ప్రజలకు వ్యతిరేకమని తేలిపోయిందని హరగోపాల్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి సూచి 2.5 శాతం ఉన్నప్పుడు ఉద్యోగాలు లభించాయని, ఉద్యోగులకు పింఛన్‌లు సక్రమంగా ఉండేవని పేర్కొన్నారు. అభివృద్ధి సూచి 8 శాతానికి పెరిగాక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతులు వచ్చాయని, ఉద్యోగుల పెన్షన్ తొలగించారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రజలు అభివృద్ధి నమునాకు వ్యతిరేకమన్నారు.
విలువల పునర్నిర్మాణం జరగాలి
ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని నిజాం కళాశాల ప్రొఫెసర్ కాశీం పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కన్నా ముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో విలువలను పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రజల శ్రమ ద్వారా ప్రభుత్వానికి అందే పన్నుల నుంచి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాలు అందుతున్నాయని, అయితే వారు చీకట్లో ఉన్న ఆ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. కోస్తాంధ్ర పెట్టుబడిదారులు తమ డబ్బు, పలుకుబడితో రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, చివరకు రాష్ట్రపతి ద్వారానే బిల్లును వెనక్కి పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజాపోరాటాలను గుర్తించి రాష్ట్రం ఇస్తున్నారని అయితే పునర్నిర్మాణం విషయంలో ముందే జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత మరింత ఎక్కువగా ఉందన్నారు.
విష సంస్కృతి పల్లెలకు వ్యాపించింది
కోస్తాంధ్ర పెట్టుబడిదారుల వల్లే మన పల్లెలకు విష సంస్కృతి వ్యాపించిందని కాశీం పేర్కొన్నారు. 60 ఏళ్ల కాలంలో మన సంస్కృతిని ధ్వంసం చేశారని, ప్రభుత్వ విద్యను మనకు అందకుండా చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయులు రాబోయే తెలంగాణలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులకు ఐలమ్మ, కొమురం భీం, దొడ్డి కొమురయ్య, బందగి, షోయబుల్లాఖాన్‌లాంటి వీరుల త్యాగాలను వివరించాలన్నారు.
అసలు పోరాటం ఇపుడే మొదలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాతే అసలు పోరాటం మొదలైందని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య అన్నారు. తెలంగాణ వనరులను, ఉద్యోగాలను కొల్లగొట్టిన సీమాంధ్ర పాలకు లు హైదరాబాద్‌పై హక్కులు పొందేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణలో లక్షన్నర మంది సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉన్నారని, అయితే 42 శాతం మంది ఇక్కడే ఉండే విధంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు తీవ్రమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకుతో తెలంగాణకు ముప్పన్నారు.
ఖమ్మం జిల్లా ముంపునకు గురవుతుందని, దీంతో లక్షలాది ఆదివాసీలు నిర్వాసితులు అవుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బూటకపు ఎన్‌కౌంటర్‌లు ఉండకూడదని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని, దళితుల వర్గీకరణ జరగాలని, విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ ఉండకూడదని ప్రజలు కోరుతున్నారన్నారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మణ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.వేణుగోపాల్, రిటైర్డ్ డైట్ లెక్చరర్ డాక్టర్ జి.లచ్చయ్య, తెరవే జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీఆర్.శర్మ, కర్షక్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కే.రశీద్, టీపీఎఫ్ జిల్లా కన్వీనర్ పీవీఎస్.ఎన్.రాజు, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ యూనియన్ నేత కొంగల వెంకటి, జేఏసీ నేతలు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, వీఎల్ నర్సింహారెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు.