టాస్క్‌ఫోర్స్ భేటీకి హాజరయిన ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి
* టాస్క్‌ఫోర్స్‌కు సూచించిన పలువురు ఐపీఎస్‌లు
* ఆస్తులు, సిబ్బంది వివరాలపై డీజీపీ నివేదిక
* అన్ని పోలీసు విభాగాల చీఫ్‌లతో విజయ్‌కుమార్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండటమే మంచిదని కొందరు ఐపీఎస్‌లు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌కు ప్రతిపాదించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో పోలీసులపై ఎవరి అజమాయిషీ ఉండాలనే అంశంపై కేంద్రం నియమిత స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బృందం.. ఐపీఎస్ అధికారులు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారుల అభిప్రాయాలను కోరింది.
విభజన నిర్ణయం నేపథ్యంలో పోలీసుశాఖ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం రెండో భేటీ బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ ఐజీ కార్యాలయంలో జరిగింది. మీడియా హడావుడి ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పు చేశారు.
డీజీపీ బి.ప్రసాదరావు, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముది, ఆపరేషన్స్ విభాగం అదనపు డీజీ జేవీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డి, అప్పా డెరైక్టర్ ఎం.మాలకొండయ్య, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ ఆర్‌పీ ఠాకూర్, ఏపీఎస్పీ అదనపు డీజీ గౌతమ్‌సావంగ్, ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, మాజీ డీజీపీలు పేర్వారం రాములు, కేఆర్ నందన్, రిటైర్డు ఐపీఎస్ అధికారి విజయరామారావు తదితరులు ఎస్‌టీఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఎస్‌టీఎఫ్ బృందం కోరిన విధంగా రాష్ట్రంలో పోలీసుశాఖకు సంబంధించిన ఆస్తులు, సిబ్బంది వివరాలను డీజీపీ అందించినట్లు సమాచారం. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు బృందాలుగా చర్చలు జరిపి ఎస్‌టీఎఫ్‌కు నివేదికలు సమర్పించారు. హైదరాబాద్‌లో సిబ్బంది నియామకాలకు అన్ని ప్రాంతాలవారినీ పరిగణనలోకి తీసుకోవాలా? ఆరవ జోన్‌కు మాత్రమే పరిమితం కావాలా? అనే అంశం ప్రభుత్వం తేల్చాల్సి ఉందని కమిషనర్ అనురాగ్‌శర్మ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
అలాగే హైదరాబాద్ పోలీసు సిబ్బంది జీతభత్యాలు ఏ రాష్ట్రం విడుదల చేస్తుందో కూడా తేల్చాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ పరిధి, ఇక్కడ సీమాంధ్రుల భద్రత అంశాలపై అధికారులు గురువారం నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ సమావే శానికి సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), హోంశాఖ ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు. కాగా 371 (డి)కి సంబంధించి న్యాయపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.