రాజధాని ఉమ్మడైతే.. శాంతిభద్రతల మాటేంటి?
ఎంతమంది వద్దంటున్నా వినిపించుకోకుండా.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ, రాష్ట్రాన్ని విభజించేందుకు కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఓ తలనొప్పి ఎదురైంది. ఉమ్మడి రాజధాని నగరంలో శాంతి భద్రతలను ఎవరు పరిరక్షిస్తారన్న విషయం పెద్ద ప్రశ్నగా మారింది. హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం పాటైనా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న సీమాంధ్ర ప్రాంత నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. అలాగే జీవోఎం కూడా ఈ ప్రతిపాదలనను తిరస్కరించింది. దీంతో ఇప్పడు ఢిల్లీ తరహాలోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనో ఇక్కడి పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఆ రెండు చోట్లా సాధారణ పాలనా వ్యవహారాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటుండగా శాంతిభద్రతలు, పోలీసింగును మాత్రం కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది.
కానీ అలా శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లో పెట్టాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కొన్ని మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. అయితే, మన రాష్ట్రానికి ఈ బిల్లు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే, ఢిల్లీ అయితే జాతీయ రాజధాని ప్రాంతం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చైనా లాంటి దేశంతో సరిహద్దు ఉంది. అందువల్ల ఆ రెండింటికీ శాంతి భద్రతలను కేంద్రం చూసుకుంటుందంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ మామూలుగా అయితే శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేవి పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పోలీసింగ్, శాంతిభద్రతలను వదులుకోడానికి ఎంతవరకు అంగీకరిస్తుందన్న విషయం మాత్రం అనుమానమే.
శాంతి భద్రతల విషయంలో ఉమ్మడి రాజధాని సరిహద్దులు కూడా సమస్యే. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధినే చూసుకుంటారా లేదా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిని కూడా చేరుస్తారా అన్నది స్పష్టం కావాలి. రెండు కమిషనరేట్లనూ ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవాలని, జీహెచ్ఎంసీ పరిధిని పాలనాపరమైన అంశాల కోసం ఉమ్మడిగా నిర్ణయించాలని జీవోఎం తలపెట్టింది. కానీ ఒకే ఉమ్మడి రాజధానికి రెండు పరిధులేంటని ఇప్పుడు కొత్త అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.