సాక్షి, ఒంగోలు : జిల్లాలో లోగ్రేడ్ ఇనుప ఖనిజం నిక్షేపాలు ఒంగోలు మండలంలోని యరజర్ల, టంగుటూరు మండలంలోని కొణిజేడు, మద్దిపాడు మండలంలోని బూరేపల్లి, అన్నంగి తదితర ఏడు గ్రామాల పరిధిలోని కొండల్లో అపారంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఆవిర్భవించక ముందే ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు మండలాల్లో లోగ్రేడ్ ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. అయితే ఈ ఇనుప ఖనిజం నిక్షేపాలను వెలికితీయడానికి అప్పట్లో సాంకేతికత అందుబాటులో లేదు. అదీగాక ఐరన్ గ్రేడ్ 28 శాతం మాత్రమే ఉన్నట్లు పూర్వపు సర్వే నివేదికల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి సర్వే చేపట్టిన దాఖలాలు లేవు.
కర్నాటకలో ఐరన్ ఓర్ మైనింగ్ బాగా విస్తరించడంతో జిల్లాలో ముడి ఖనిజం వెలికితీత మరుగున పడింది. అయితే కర్నాటక రాష్ట్రంలోని కుద్రేముఖ్ ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ లోగ్రేడ్ ఐరన్ ఓర్ అయినా మైనింగ్ చేస్తామని ముందుకు వచ్చింది. దీంతో 1998లో ఆ కంపెనీకి అప్పటి ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. కుద్రేముఖ్‌కు చెందిన కంపెనీ ఒంగోలు సమీపంలోని యరజర్ల వద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి, ఐరన్ ఓర్ నుంచి తీసిన పిల్లెట్లను కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం నుంచి రవాణా చేసేందుకు ప్రాథమికంగా డీపీఆర్ తయారు చేసుకుంది. ఈ క్రమంలోనే యరజర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధంకాగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడినా ఐరన్ ఓర్ తీయడం వల్ల ఇబ్బందులు ఎదురావుతాయని అభిప్రాయాలు వెల్లడించడంతో మైనింగ్ అంశం అటకెక్కింది. ముడి ఖనిజం ఉన్న భూములను ఏపీఎండీసీకి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐరన్ ఓర్‌ను వెలికితీసి ఎగుమతి చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఏపీఎండీసీ వద్ద వనరులు అందుబాటులో లేకపోవడంతో జింపెక్స్ అనే ప్రైవేట్ సంస్థతో కలిసి ఖనిజాన్ని వెలికితీయడానికి సిద్ధమైంది. కానీ మైనింగ్‌లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
1300 ఎకరాలు ఏపీఎండీసీ పరిధిలోనే..
జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు మండలాల్లో మొత్తం 1300 ఎకరాలను సర్వే చేసి ఏపీఎండీసీకి అప్పగించారు. ఐరన్ ఓర్ మైనింగ్‌కు రిజర్వ్ చేసిన భూములు కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో గ్రావెల్ కొరత తీవ్రమైంది. గత ప్రభుత్వం ఈ కొండలను డీ రిజర్వ్ చేసి గ్రావెల్ తవ్వకానికి, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున డీ రిజర్వ్ చేయలేకపోయారు. యర్రజర్ల వద్ద గృహ నిర్మాణానికి, ఇతర కట్టడాలకు ప్రభుత్వం అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవడానికి అనుమతులు ఇచ్చినా గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ఇబ్బందులు, పాలనాపరంగా, న్యాయపరంగా చిక్కులు వచ్చాయి.
6 కోట్ల టన్నుల నిక్షేపాలు
జిల్లాలోని యర్రజర్ల, కొణిజేడు, మర్లపాడు, బూరేపల్లి, అన్నంగి తదితర గ్రామాల్లో ఉన్న కొండల్లో సుమారు రూ.6 కోట్ల టన్నుల మేర ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లుగా అంచనా. జాతీయ రహదారుల అభివృద్ధి కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ అన్నంగి, బూరేపల్లి ప్రాంతాల నుంచి వేలాది టన్నుల గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వేసి వినియోగించుకున్నా గత ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించింది. ఒంగోలు మండలం యరజర్ల కొండల పరిసరాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వి విక్రయించి రూ.లక్షలు గడించినా పట్టించుకున్న నాథుడే లేడు. జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్‌కు 2015లో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.
అయితే కాలుష్య నియంత్రణ మండలితోపాటు మరికొన్ని అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హొస్పేట్‌కు చెందిన సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ప్రాంతంలో లీజు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకున్నామని తమకే లీజు ఇవ్వాలని కోరింది. అయితే ఏపీఎండీసీ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దానికే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం కోర్టులోనూ ఏపీఎండీసీకి అనుకూలంగా తీర్పు రావడంతో జింపెక్స్‌తో కూడా సంబంధం లేకుండా సొంతగానే ఇనుప ఖనిజం తవ్వాలని యోచిస్తోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment