
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలకు మరో తార్కాణమిది. నాగావళి కాలువ లైనింగ్ పనుల్లో ఇద్దరు మంత్రులు కమీషన్ల వేట సాగిస్తున్నారు. తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టు సంస్థకే 4.29 శాతం అధిక ధరలకు(ఎక్సెస్)కు పనులు కట్టబెట్టేలా చక్రం తిప్పారు. కాంట్రాక్టర్ నుంచి చెరో రూ.25 కోట్లు కమీషన్లుగా ఇద్దరు మంత్రులు వసూలు చేసుకోనున్నారు. నాగావళి నదిపై 1907–08లో బ్రిటీష్ ప్రభుత్వం తోటపల్లి రెగ్యులేటర్‌ను నిర్మించింది. ఈ రెగ్యులేటర్ నుంచి కుడి కాలువను 37.626 కి.మీ.లు, ఎడమ కాలువను 20.016 కి.మీ.ల దూరం తవ్వారు.
వీటి ద్వారా 1934లోనే 64,000 ఎకరాలకు నీళ్లందించారు. రూ.162.49 కోట్లతో ఈ కాలువలను ఆధునికీకరించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ వెంచర్లు(ఇద్దరు కాంట్రాక్టర్లు కలిసి సంస్థను ఏర్పాటుచేయడం) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధన పెట్టారు. కానీ, ఏలేరు కాలువల ఆధునికీకరణ టెండర్లలో మాత్రం జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చని నిబంధన విధించడం గమనార్హం. జీవో 94 ప్రకారం టెండర్లు నిర్వహించాలంటూ జలవనరుల శాఖ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు తుంగలో తొక్కడానికి ప్రధాన కారణం కీలక మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిళ్లేనని సమాచారం.
మాట వినకపోతే బ్లాక్‌లిస్టులో..
నాగావళి కాలువల ఆధునికీకరణ పనులకు అంచనాలు రూపొందించే సమయంలోనే అక్రమాలకు పాల్పడ్డారు. అంచనా వ్యయం పెంచేలా ఇద్దరు మంత్రులు చక్రం తిప్పారు. ఆ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. వారిని ‘బ్లాక్‌లిస్ట్’లో పెడతామని హెచ్చరించారు. దాంతో ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు.
అధికారులు ఆగస్టు 31న టెక్నికల్ బిడ్ తెరిచారు. కేవలం రెండు సంస్థలు(ష్యూ ఇన్‌ఫ్రా, సాయిలక్ష్మి)మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశాయి. సాయిలక్ష్మి కంటే ‘ష్యూ ఇన్‌ఫ్రా’ తక్కువ ధర కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ష్యూ ఇన్‌ఫ్రాకు పనులు దక్కే అవకాశం ఉందని గ్రహించిన మంత్రులు.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆ సంస్థపై అధికారులు అనర్హత వేటు వేశారు. కానీ, గత నెలలో తెలుగుగంగ కాలువల ఆధునికీకరణ పనులకు రూ.239.03 కోట్లతో పిలిచిన టెండర్లలో ష్యూ ఇన్‌ఫ్రా అర్హత సాధించినట్లు ఇదే జలవనరుల శాఖ అధికారులు ప్రకటించడం గమనార్హం.
సింగిల్ షెడ్యూల్‌కు పచ్చజెండా
ఒక సంస్థపై అనర్హత వేటు వేయడంతో బరిలో మరో సంస్థ మాత్రమే మిగిలింది. సింగిల్ షెడ్యూల్ ఉంటే ఫైనాన్స్(ఆర్థిక) బిడ్‌తెరవకూడదు. సర్కార్ జారీ చేసిన జీవో 174 ప్రకారం.. ఆ టెండర్లను రద్దు చేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. కానీ, ఇద్దరు మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇటీవల ఆర్థిక బిడ్‌ను తెరిచారు.
4.29 శాతం అధిక ధరలకు షెడ్యూల్ దాఖలు చేసిన సాయిలక్ష్మి సంస్థకు నాగావళి కాలువ ఆధునికీకరణ పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదముద్ర వేయడమే తరువాయి.. పనులను సాయిలక్ష్మి సంస్థకు అప్పగించి, రూ.25 కోట్ల చొప్పున కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారు.
7న తమిళనాడుకు రెడ్ అలెర్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 7న తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ కేంద్రం రెడ్ అలñ ర్ట్ ప్రకటించింది. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఈ నెల 7న 25 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ గురువారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లంతా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని, సహాయక శిబిరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ కమిషనర్ సత్యగోపాల్ ఆదేశించారు.
ఏసీబీ వలలో ఈవో
విశాఖ క్రైం: దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవో పెదిరెడ్ల సత్యనారాయణ ఉద్యోగుల వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. దేవదాయ «ధర్మదాయ శాఖ ఉద్యోగులకు 2015 సంవత్సరానికి రావాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపుల కోసం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ కొంత సొమ్ము ముడుపుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు రికార్డు అసిస్టెంట్ గాలి వెంకటశివతో కలెక్షన్ చేయించి చివరకు రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment