
ఇస్తేనే వ్యాపారం.. లేదంటే దుకాణం బంద్
ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే భర్త హుకుం
సాక్షి టాస్క్ ఫోర్స్ : వ్యాపారం ఏదైనా ఆయనకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే. ఈ విషయంలో రికమండేషన్లు ఏమీ పని చేయవు. ఆ నేత ఎంత చెబితే అంత ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించేందుకు ఆయన బినామీలు, అధికారులు రంగంలోకి దిగుతారు. అయితే పర్సేంటేజీ.. లేకుంటే గుడ్‌విల్. ఏదో ఒకటి సెటిల్‌మెంటు చేసుకోవాలి. ఇదీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ సాగిస్తున్న కమీషన్ల బాగోతం.
తాజాగా చికెన్ అంగళ్ల నిర్వాహకులు పర్సంటేజీ/గుడ్‌విల్ ఇవ్వడానికి ససేమిరా అనడంతో అధికారులపై ఒత్తిడి తెచి్చ.. అనుమతులు లేవంటూ నోటీసులిచ్చి, దుకాణాలకు తాళం వేయించడం విస్తుగొలుపుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హోల్‌సేల్ చికెన్ దుకాణాల వారిని టీడీపీ నేత పిలిపించారు. నియోజకవర్గంలో ఎంత చికెన్ అమ్మినా కిలోకు రూ.10 చొప్పున మామూలు ఇవ్వాలని, అది కూడా గోవా నుంచి తాము తెప్పించే చికెన్‌ను మాత్రమే కొనుగోలు చేసి రిటైల్ వ్యాపారులకు విక్రయించాలని హుకుం జారీ చేశారు.
ఇందుకు చికెన్ అంగళ్ల నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీనికంతటికి కారకుడు ఏఎన్‌ఆర్ హోల్‌సేల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడే అని అతన్ని పిలిపించి రూ.కోటి ఇవ్వాలని, లేకుంటే నీ వ్యాపారం జరగనివ్వమని బెదిరించారు. అంత ఇచ్చుకోలేమని అతను తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో మీకు వ్యాపారం నిర్వహించుకునేందుకు అనుమతులు లేవని మున్సిపల్ కమిషనర్‌తో నోటీసులు ఇప్పించి సీజ్ చేయించారు.
నోటీసులు అందుకున్న చికెన్ సెంటర్ యాజమాన్యం.. ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం వద్దకు పలుమార్లు తిరిగినా స్పందించలేదు. దీంతో కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ లైసెన్స్ ఇవ్వక పోవడంతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. కలెక్టర్ మందలించడంతో ఎట్టకేలకు అనుమతులు ఇచ్చారు. అయితే సమస్య సద్దు మణిగిందని అందరూ అనుకుంటున్న సమయంలో శనివారం రాత్రి ఒక్కసారిగా ఆళ్లగడ్డలో కలకలం రేగింది.
పట్టణంలో విక్రయిస్తున్న చికెన్ మనుషులు తినేందుకు పనికి రాదని, ఈ మేరకు విజయవాడలోని పశు సంవర్దక శాఖ లేబరేటరీ నివేదిక ఇచ్చిందని మున్సిపల్, ఫుడ్, రెవెన్యూ అధికారులు.. పోలీసులను వెంటబెట్టుకుని నాలుగు చికెన్ దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగక తాళాలు వేయించడం చర్చనీయాంశం అయింది. అధికార పార్టీ నేతతో బేరం కుదరక పోవడం వల్లే ఇలా జరిగిందని పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment