రాజకీయ గ్రహణం
►‘బ్రహ్మానందసాగర్’ రిజర్వాయర్‌తోనే నీటి సమస్యకు చెక్
►2013లోనే పూర్తయిన ప్రాజెక్టు సర్వే
►రాజకీయ కారణాలతో పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం
►ప్రాజెక్టు పూర్తయితే 22 లక్షల మందికి తాగునీరు
►గ్రావిటీ ద్వారా నరసరావుపేటతో పాటు గుంటూరుకు...
►1.5 టీఎంసీల నిల్వతో పెరగనున్న భూగర్భ జలాలు
►ఏటా త్వరితగతిన ఖరీఫ్ ఆరంభానికి అవకాశం
నకరికల్లు మండలం చేజర్ల-కుంకలగుంట గ్రామాల మధ్య రూ.65 కోట్ల వ్యయంతో 2150 ఎకరాల్లో ప్రతిపాదించిన బ్రహ్మానందసాగర్ (కాసు బ్రహ్మానందరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కు రాజకీయ గ్రహణం పట్టింది. గత పాలకులు ప్రతిపాదించిన పనులు పూర్తిచేస్తే తమకు ప్రయోజనమేమిటనే కారణంతో ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు. నాగార్జునసాగర్ ద్వారా కాలువలకు విడుదలైన నీటిని ఒక చోట నింపి కరువు సమయంలో వినియోగించుకోవడం ఈ రిజర్వాయర్ నిర్మాణ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తయిఉంటే ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేవి.
నరసరావుపేటవెస్ట్: సాగునీరు లేక గత ఖరీఫ్, రబీ సీజన్లలో వేలాది ఎకరాల్లో పంటలు వేయలేక ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వేసవిలో తాగేందుకు మంచినీరు లభ్యం కాక నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు కార్పొరేషన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని అధిగమించాలంటే కుడికాలువ పరిధిలో ఇప్పటికే ఉన్న బుగ్గవాగులాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు మరో రిజర్వాయర్ నిర్మాణమే శరణ్యమని ఎన్‌ఎస్పీ ఇంజినీర్లు చెబుతున్నారు.
1250 ఎకరాల్లో 1.5 టీఎంసీల నిల్వ
గత ప్రభుత్వంలో నకరికల్లు మండల పరిధిలోని చేజర్ల-కుంకలగుంట గ్రామాల మధ్య 1250 ఎకరాల్లో 1.5 టీఎంసీల సాగర్ నీటిని నిల్వచేసేందుకు బ్రహ్మానందసాగర్ పేరుతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్మాణంలో 1.5 కిలోమీటర్ల పొడవైన గట్టు(బండ్)ను అక్కడక్కడ నిర్మించాల్సి వుంది. ఈ రిజర్వాయర్‌లో నిల్వచేసే నీటితో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు, మున్సిపాల్టీలోని రిజర్వాయర్లను నింపవచ్చు. అటువంటి నీటి పరిమాణంగల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.33 లక్షల వ్యయంతో సర్వే చేయాలని 2013 మార్చి 1న అప్పటి ప్రభుత్వం జీవో నం.17ను జారీ చేసింది. సర్వే పూర్తయి ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పరిపాలనా ఆమోదం లభించి ఆర్థిక ఆమోదం కోసం ఫైల్ వెళ్లింది. ఆ తర్వాత సమైక్య రాష్ట్ర ఉద్యమం, అనంతరం ఎన్నికల వలన రిజర్వాయర్ పనులకు ఆర్థిక ఆమోదం లభించలేదు.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో ప్రయోజనాలు...
ఈ రిజర్వాయర్ పూర్తయి నీటిని నిల్వ చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు గ్రావిటీ ద్వారా నరసరావుపేట, చిలకలూరిపేట మున్సిపాల్టీలు, గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు గుంటూరు కార్పొరేషన్ పరిధి కలుపుకొని మొత్తం 21.23 లక్షలమంది ప్రజలకు ఒక్కొక్కరికి 200 లీటర్ల చొప్పున 100 రోజులపాటు తాగునీరు అందించవచ్చని ఇంజినీర్లు అంచనావేశారు. దీంతో పాటు సాగర్ కాలువలు విడుదలయ్యే దాకా వేచి ఉండకుండా త్వరగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు తమ పొలాలను సాగుచేసేందుకు సమాయత్తం కావచ్చు. దీనివలన ఈ ప్రాంతంలో కరువు చాయలు తొలగిపోతాయని చెబుతున్నారు.
సేకరించాల్సిన భూమి 650 ఎకరాలే
ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించిన కుంకలగుంట-చేజర్ల గ్రామాల మధ్యలోని 1250 ఎకరాల్లో 600ఎకరాలు ప్రభుత్వ భూమే ఉందని నివేదికలో పేర్కొన్నారు. మిగతా 650 ఎకరాలను రైతులకు సరైన మార్కెట్ రేటును అప్పగించి స్వాధీనం చేసుకుంటే రిజర్వాయర్‌ను పూర్తిచేసుకునేందుకు తగిన వెసులుబాటు లభిస్తుంది. కొంతమంది టీడీపీ నాయకుల ప్రోద్బలంతో అప్పుడు కొంతమంది రైతులు తమ పొలాలను ఇవ్వబోమంటూ ఆందోళనలు నిర్వహించారు. నకరికల్లు వద్దనున్న 270 ఎకరాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఉండగా కమీషన్లు కొట్టేసేందుకే బ్రహ్మానందసాగర్‌ను ప్రతిపాదిస్తున్నారంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఇప్పటికైనా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న పలనాడు రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజలకు మేలు చేసిన వారవుతారు.