బీమా సంస్థలకు కుచ్చుటోపీ? | is drivers are blaming insurance companies? | Sakshi
Sakshi News home page

బీమా సంస్థలకు కుచ్చుటోపీ?

Published Mon, Aug 26 2013 4:10 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

is drivers are blaming insurance companies?

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : డ్రైవర్ మూడు వరుస ప్రమాదాలు చేస్తే అతని లెసైన్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వ నిబంధన. అయితే ఇలా వరుస ప్రమాదాలు జరిగినా ఎక్కడా లెసైన్స్‌లు రద్దు చేసిన దాఖాలాలు లేవు. ఒక వేళ అనుభవం, అర్హత లేని డ్రైవర్లు ప్రమాదాలు చేస్తే వారిని మారుస్తూ బీమా సంస్థల నుంచి పరిహారాన్ని పొందుతున్నారు. ఇలా తప్పులు చేస్తూ పోలీసులకూ అమ్యామ్యాలు ముట్టజేస్తున్నారు. ఇలా బీమా సంస్థ నష్టపోవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కూడా పరోక్షంగా పోలీసులు కారణమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మరికొన్ని సంఘటనల్లో వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ లేకపోతే మరో వాహనాన్ని ఏర్పాటు చేసి కేసు నమోదు చేస్తున్నారు.
 
   గతేడాది నవంబర్ 9న పుల్‌కల్ మండలం తాడ్దాన్‌పల్లి గ్రామ శివారులోని అకోలా - నాందేడ్ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ (ఏపీ 23 4966) ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కానీ పోలీసులు మాత్రం(క్రైమ్ నంబర్ 78) గుర్తు తెలియని ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టాడని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. అనంతరం ట్రాక్టర్‌ను, అర్హత గల డ్రైవర్‌ను కేసులో అరెస్టు చేసినట్లు చూపించి కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ సంఘటన కు ప్రధాన కారణమైన ట్రాక్టర్ డ్రైవర్, ట్రాక్టర్‌ను పోలీసులు తప్పించినట్లు సమాచారం. ఇందుకు ట్రాక్టర్‌కు ఫిట్‌నెస్ లేకపోవడం, డ్రైవర్‌కు లెసైన్స్ లేకపోవడం వల్లే ఇలా చేశారని తెలుస్తోంది.
 
      మే 25న పుల్‌కల్ మండలం బస్వాపూర్ శివారులో టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని ఆటో ( ఏపీ 23వై 8679) ఢీకొంది. ఈ సంఘటనలో కుమ్మరి నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాద సమయంలో ఆటోను మిన్‌పూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చంద్రయ్య నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అయితే ఆటో బోల్తా పడిన సమయంలో డ్రైవర్ చంద్రయ్యకు తలకు గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో మే 25 సాయంత్రం 5.45లకు చేరి ఐదు రోజులపాటు చికిత్స పొందినట్లు డాక్టర్ ధ్రువీకరించారు. ఆరోజు 108లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఈ సంఘటనలో భారత్ గ్యాస్ కార్యాలయంలో పనిచేస్తున్న డప్పూరి లక్ష్మినారాయణ అనే యువకుడిని ఆటో డ్రైవర్‌గా గుర్తిస్తూ జూన్ 9న జోగిపేట కోర్టుకు రిమాండ్ చేశారు.
 
      ఈ నెల 7న న్యూ ఒన్నాపురం, తాడ్దాన్‌పల్లి గ్రామ శివారుల మధ్య జోగిపేట - సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చింతకుంట భాగ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో పాటు చింతకుంట లక్ష్మికి మరో నలుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. సంఘటన జరిగి 13 రోజులు కావస్తున్నా పోలీసులు ఇంత వరకు ఆటో డ్రైవర్‌ను గానీ, ఆటోను గానీ గుర్తించలేకపోయారు. ఇందుకు బోల్తాపడిన ఆటోకు రిజిస్ట్రేషన్ లేకపోవడం, డ్రైవర్‌కు లెసైన్స్ లేని కారణంగానే కేసు నమోదు చేసినా డ్రైవర్, ఆటోను గుర్తించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాగా, పోలీసులు వాహనాలను, డ్రైవర్లను మార్చేందుకు ముడుపులు తీసుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి.
      పుల్‌కల్ సమీపంలో జరిగిన ఓ ప్రమాదానికి కారణమైన చంద్రయ్య అనే డ్రైవర్ గతేడాది ట్రాక్టర్‌ను బోల్తా వేయడంతో పాపన్నపేట మండలానికి చెందిన వలస గిరిజన కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో సైతం పోలీసులు ఇతడిని తప్పించారు. ఇలా ప్రతి రోడ్డు ప్రమాదంలోనూ నిందితులకు శిక్ష పడకుండా పోలీసులు తప్పిస్తున్నారు. దీంతో సదరు నైపుణ్యంలేని డ్రైవర్లు మళ్లీ..మళ్లీ ప్రమాదాలు చేస్తూ దర్జాగా మళ్లీ వాహనమెక్కుతున్నారు. పైగా ఇలాంటి కేసులన్నీ పుల్‌కల్ మండలంలోనే ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అసలైన నిందితులకే శిక్ష పడేలా చూడడంతో పాటు అమ్యామ్యాలకు అలవాటుపడ్డ పోలీసుల పనితీరు సైతం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
 పుల్‌కల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కేసుల్లో డ్రైవర్లను, వాహనాలను మారుస్తున్న విషయంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. చట్ట విరుద్ధంగా డ్రైవర్లను మార్చడం సరైంది కాదు. ఇందుకు పూర్తి బాధ్యత పోలీసులే వహించాల్సి ఉంటుంది.  
 - విజయకుమార్, మెదక్ ఎస్పీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement