రాజధానిలో దేవుళ్లకూ స్థానం లేకుండా చేస్తారా?
Published Wed, Jun 29 2016 9:32 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
-విచక్షణా రహితంగా గుడులను, మసీదులను కూల్చేస్తున్నారు
-వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్మిస్తున్న రాష్ట్ర రాజధానిలో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలతో పాటుగా దేవుళ్లకు కూడా స్థానం లేకుండా చేయాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతంలో విచక్షణా రహితంగా టీడీపీ ప్రభుత్వం దేవాలయాలను, మసీదులను కూల్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్యలు ఘజనీ, ఘోరీలను తలపిస్తున్నాయన్నారు. దేవాలయాలే కాకుండా మసీదులను కూడా విచక్షణా రహితంగా పడగొడుతున్నారన్నారు. ఇప్పటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో 25 నుంచి 30 వరకూ దేవాలయాలను, కొన్ని మసీదులను పడగొట్టారన్నారు. స్థానిక ప్రజలు ఎంత వ్యతిరేకించినా, బంద్ పాటించినా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా లెక్క చేయకుండా దేవాలయాలను, మసీదులను కూల్చేసుకుంటూ పోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
విజయవాడలో సీతమ్మ పాదాలు, శనేశ్వరాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, సాయిమందిరం ఇలాంటి వాటన్నింటితో పాటుగా రామవరప్పాడు మసీదును కూడా పడగొట్టడం దారుణమని విమర్శించారు. రామవరప్పాడు మసీదు ప్రాంతంలో ఉన్న ముస్లింలను రాత్రిపూట అరెస్టు చేసి మరీ కూల్చి వేశారన్నారు. గోశాల, నిన్న గోశాలకు చెందిన శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చి వేయడం దుర్మార్గమని పార్థసారథి మండిపడ్డారు. గోశాల ఉంటున్న భూమిలో సగం గోశాలకే చెందినదని, మరో సగం ఇరిగేషన్ శాఖదని ఆయన అన్నారు.
దేవాలయాలను, మసీదులను పడగొట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ వారు దేవాలయాల కూల్చి వేతపైన వెంటనే స్పందించాలని, మసీదుల కూల్చివేతపైన ముస్లిం మైనారిటీ సంస్థలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వద్దని తాము అనడం లేదని అయితే ఈ సమయంలో మతభావాలను గౌరవించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement