- రుణాలు ఎక్కడ మాఫీ చేశారు ?
- టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే రోజా ప్రశ్న
విజయపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకానికి విలువ లేకపోయిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో చేసిన సంతకానికి తిరుగులేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.
శుక్రవారం ప్రజాబాట కార్యక్రమంలో ఆమె మండలంలోని నార్పరాజుకండ్రి గ, బొగ్గలవారికండ్రిగ, మల్లారెడ్డికండ్రిగ, శ్రీహరిపురం, మహరాజపురం గ్రామాల్లో పర్యటించారు. శ్రీహరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతు, డ్వాక్రా, చేనేత కార్మికులను రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు సీఎం పీఠం దక్కించుకున్నారని, అయితే నమ్మి ఓటు వేసిన రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శిం చారు.
రైతులకు రూ.1.5లక్షలు, డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని సంతకం చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి రుణమాఫీ జరగలేదంటే ఆయన సంతకానికి విలువలేకుండా పోయినట్టేనని ఎద్దేవా చేశారు. రుణాలు వెంటనే కట్టాలని, తాకట్టు పెట్టిన బంగారును వెంటనే విడిపించుకోవాలని బ్యాంకర్లు రైతులకు ఓ వైపు నోటీసులు పంపుతుంటే... రుణమాఫీ చేసిన చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని మరో వైపు టీడీపీ నాయకులు ఫెక్లీబోర్డులు ఏర్పటు చేయడం హాస్యాస్పదం గా ఉందన్నారు.
రుణాలు ఎక్కడ మాఫీ చేశారని ఆమె టీడీపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రం వెంటనే రుణమాఫీ చేయాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడ మాత్రం ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకాలని ఆమె విమర్శించారు.