
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్‌కు సమైక్య సెగ తగిలింది. పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఊహించని పరిణామంతో రాధాకృష్ణన్ కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.
తమ ప్రాంత ఆకాంక్షను కేంద్ర మంత్రి వి నారాయణస్వామికి తెలిపేందుకు జర్నలిస్టులు సమైక్య నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో నారాయణస్వామి సభ్యుడిగా ఉన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం తరపున నారాయణస్వామి హాజరయ్యారు.
మరోవైపు 'తమిళ త్రయం'గా ముద్రపడిన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, నారాయణస్వామి తమ రాష్ట్రాన్ని విడదీసేందుకు కంకణం కట్టుకున్నారని సీమాంధ్రుల్లో గూడుకట్టున్న ఆవేదన కూడా సీమాంధ్ర విలేకరుల నిరసనకు కారణంగా కనబడుతోంది. ఏదీఏమైనా షార్ వేదికగా సీమాంధ్ర జర్నలిస్టులు సమైక్య గళం వినిపించారు.