
నేతలకు ఎంపీలపై కంట్రోల్ లేదు: నారాయణసామి
న్యూఢిల్లీ: ‘‘రాజకీయ పార్టీల నేతలకు వారి ఎంపీలపై ఎలాంటి కంట్రోలు లేదు.. సమావేశాలు జరుగుతుంటే సభామధ్యంలోకి దూసుకొస్తారు.. నినాదాలు చేస్తారు.. సభ జరగకుండా అడ్డుకుంటారు..’’ అంటూ కేంద్రమంత్రి నారాయణ సామి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ అంశంపై కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడింది.
ఆ వెంటనే బయటకు వచ్చిన నారాయణ సామి పార్లమెంట్ ముందు విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. మీ పార్టీ ఎంపీలే సభలో నినాదాలు చేశారు కదా.. అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మామూలుగా నా అభిప్రాయం చెప్పా..’’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలుపుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ధీమా వ్యక్తం చేశారు.