మెటల్ చిప్స్ విసిరిన విద్యార్థులు.. చిరంజీవి, బొత్సలకు శృంగభంగం
రాజాం, న్యూస్‌లైన్: వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల బృందానికి సమైక్య సెగ తగిలింది. పలు చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, విద్యార్థులు, రైతుల నుంచి నిరసనలు, అడ్డంకులు ఎదురయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళీమోహన్‌ల కాన్వాయ్ రేగిడి మండలానికి వెళుతుండగా మొదట రాజాంలోని మాధవ బజార్ జంక్షన్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
జై సమైక్యాంధ్ర, మంత్రులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని పక్కకు నెట్టేసి కాన్వాయ్‌ని ముందుకు పంపారు. అనంతరం రేగిడి మండలం లచ్చన్నవలస జంక్షన్‌లో కేంద్రమంత్రి చిరంజీవి ఓపెన్ టాప్ జీపు ఎక్కి రైతులనుద్దేశించి మాట్లాడుతుండగా కొంతమంది యువకులు అడ్డుకొని.. విభజనను వ్యతిరేకించని మంత్రులు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పర్యటన ముగించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజాం తిరిగి వచ్చిన మంత్రుల బృందం కేర్ ఆస్పత్రిని పరిశీలించి బయటకు వస్తున్న సమయంలో పక్కనే ఉన్న జీసీఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులందరూ తరలి వచ్చి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. మంత్రులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు సమీపంలో ఉన్న మెటల్ చిప్స్(చిన్న చిన్న గులక రాళ్లు)ను కాన్వాయ్‌పైకి విసిరారు. మంత్రులు వాటిని తప్పించుకుని కారులో వెళ్లిపోయారు.
‘చిరు’ బృందానికి సమైక్యసెగ
Published Wed, Oct 30 2013 2:25 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement