కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుం బంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి అన్నారు. అనంతసముద్రం సొసైటీలో పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా రుణాలిచ్చారనే కేసులో కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్ద సీబీసీఐడి పోలీ సులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సుభాషిణి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కు 2014లో ఎస్.ఐ రంగనాయకులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితునిగా ఉన్న ఆయన్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ అదనపు ఎస్పీ శ్రీధర్, సీఐ ఎస్‌ఎం షరీఫ్ శుక్రవారం కడపకు తీసుకొచ్చి అరెస్ట్ చూపించారు. ఈ సందర్బంగా బ్రహ్మానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.
తన సోదరుడు కొల్లం గంగిరెడ్డి రాజంపేట పరిధిలో ఉన్నంతకాలం ఎలాంటి కేసులు బనాయించ లేదన్నారు. ఆయన విదేశాలకు వెళ్లగానే ఏకంగా 27 కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. తన బావ, పుల్లంపేట ఎంపీపీ బాబుల్‌రెడ్డిని అరెస్టు చేసి కటకటాలపాలు చేశారన్నారు. ఆయన ఒక కేసులో శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని జీఓ ఉన్నప్పటికీ అప్పటికప్పుడు ప్రభుత్వం ఇంకో జీఓను పుట్టించి అతన్ని అరెస్టు చేసి ఇబ్బందుల పాలు చేశారన్నారు. అయినప్పటికీ తాము భయపడటం లేదన్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. అనంతరం ఆయన్ను జిల్లా కోర్టులోని ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ లావణ్య ఎదుట హాజరు పరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకు ముందు కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్ బాష, కార్పొరేటర్ రామలక్ష్మణ్‌రెడ్డి, పలువురు నేతలు పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి బ్రహ్మానందరెడ్డిని పరామర్శించారు.
ఇది కక్ష సాధింపు
Published Sat, Jul 18 2015 3:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement