సీమాంధ్ర ఉద్యోగులకు నొప్పి కలిగించినా, తప్పదు: కేసీఆర్
సీమాంధ్ర ఉద్యోగులకు నొప్పి కలిగించినా, తప్పదు: కేసీఆర్
Published Mon, Aug 5 2013 1:56 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా ఉద్యోగులంతా తెలంగాణలోనే ఉంటామంటే ఇక ప్రత్యేక రాష్ట్రమెందుకని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగుల్లో కొందరికి నొప్పి కలిగించినా ఒప్పుకోక తప్పదన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పలు అంశాలపై కేసీఆర్ మూడు గంటలపాటు సవివరంగా సమాధానాలిచ్చారు. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు కె.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, కె.వి.రమణాచారి, టీజేఎఫ్ నేతలు ఆర్.శైలేశ్‌రెడ్డి, క్రాంతి, రమణ, పల్లె రవికుమార్, పి.వి.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. అంశాలవారీగా కేసీఆర్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...
ఉద్యోగుల విభజనపై
ఆంధ్రా ఉద్యోగులను ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఎవరూ అనలేదు. నేను చెప్పని మాటలను చెప్పినట్టు వక్రీకరించారు. ఎవరూ ఎవరినీ పంపిస్తమనలేదు. ఉద్యోగుల పంపకం ఆషామాషీగా జరగదు. కేసీఆర్ చెప్పినట్టు అసలే జరగదు. అయితే ప్రపంచంలో ఎవరికీ లేని ముల్కీ నిబంధనలు తెలంగాణకున్నయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన సుమారు 84 వేల ఉద్యోగాల్లో తెలంగాణేతరులున్నట్టు సుందరేశన్ కమిటీ తేల్చింది. వారిని వెనక్కు పంపడానికి ఇచ్చిన 610 జీవో అమలు కాలేదు. ఆంధ్రా ఉద్యోగులను వెనక్కు పంపలేదు. కొందరికి నొప్పి కలిగించినా నిబంధనల ప్రకారం వెళ్లిపోవాల్సిందే. ఆప్షన్ల పేరుతో లక్షా 50 వేల మంది ఇక్కన్నే ఉంటామంటె ఎట్ల? వాళ్లలో కొందరిని వెనక్కు పంపకపోతె తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏం ప్రయోజనం? ఆంధ్రప్రదేశ్‌లనే ఉంటె సాలదా? కేంద్రం చెప్తున్న ప్రకారం 10 ఏండ్లు ఉండొచ్చు. ఆ తరవాత కూడా పౌరులుగా ఎంతకాలమైనా ఇక్కడే ఉండొచ్చు. ఉద్యోగాల పంపకంలో కేంద్ర విధి విధానాలు అమలు కావాల్సిందే కదా. టీఆర్‌ఎస్ కూడా శివసేన రూపం సంతరించుకుంటున్నదా అని కొందరంటున్నరు. 13 ఏండ్ల ఉద్యమంల ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగినయా? బీమా సంస్థలో జరిగిన ధర్నాలో కేసీఆర్ ఫొటోను చెప్పులతో కొట్టిండ్రు. ఇట్లా వ్యవహరించడం సరైనదేనా? హైదరాబాద్‌లో ఉండాలనుకునేవాళ్లు ఇలా చేస్తరా?
హైదరాబాద్‌పై స్పష్టత కావాలె
10 జిల్లాల తెలంగాణ అంటే హైదరాబాద్ కూడా తెలంగాణలో అంతర్భాగమే. దాన్ని ఉమ్మడి రాజధాని అంటున్నరు. అంటే ఏమిటో స్పష్టత కావాలె. శాశ్వత ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం, హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కులంటె కేసీఆర్ తల తెగిపడినా ఒప్పుకోడు. హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే తెలంగాణలో అంతర్భాగంగా ఉండాల్సిందే. హైదరాబాద్ చుట్టూ 100-150 కిలోమీటర్ల మేర శాటిలైట్ టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తం. ఫార్మా సిటీ, ఫిలిం సిటీ, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకుంటం. పెట్టుబడులకు అత్యంత భద్రమైన నగరం హైదరాబాద్ అని ప్రపంచ సీఈఓల అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. అదే ఇమేజీని మరింత పెంచుతం. ఉద్యమకారులకు ఇతర ప్రాంత ప్రజలపై ద్వేషముండదు.
తెలంగాణలో 24 జిల్లాలు
స్వాతంత్య్రానంతరం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరగనిది పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ల్లో మాత్రమే. సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, మహబూబ్‌నగర్‌లో మూడు జిల్లాలు... ఇలా తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటు కావాలి. జిల్లాకో నిమ్స్ స్థాయి ప్రభుత్వాసుపత్రి ఉంటది. మండల, నియోజకవర్గ స్థాయిలోనూ ఆరోగ్య వ్యవస్థను, వివిధ విభాగాలను నిపుణులతో ఏర్పాటు చేసుకుంటం. భాష, సంస్కృతి వంటివాటిని పరిరక్షించుకుంటం. వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటం. పేర్లు చెప్పను కానీ కొందరు రియల్ ఎస్టేట్ గద్దలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి కొంత కఠినంగనే ఉంటం. చంచల్‌గూడ జైలును అక్కడి నుండి తీసేసి ముస్లిం మహిళలకు పాఠశాలగా మార్చుకుంటం. సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తం. రా్రష్ట్రం సాధించిన ఘనత ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తరు.
నదీజలాలు.. సాగునీరు...
సాగునీటి విషయంలో తెలంగాణ ప్రపంచానికే ఆదర్శంగా ఉండేది. నిజాం హయాంలోనే గొలుసుకట్టు చెరువులుండేవి. సమైక్య ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసింది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చుకుంటం. కృష్ణా, గోదావరిల నుండి 1,300 టీఎంసీల దాకా నికర జలాలొస్తయి. మరికొన్నింటిని సాధించుకుంటం. దీనికోసమే రాష్ట్ర విభజన పూర్తయ్యేదాకా జలాల పంపకాన్ని ఆపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేస్తున్నం. తెలంగాణలో బోర్ల కింద సాగయ్యే భూమిని కూడా సాగుభూమి కింద చూపిస్తూ సమైక్య ప్రభుత్వం ఇప్పటిదాకా మోసం చేసింది. ప్రతి నీటిచుక్కనూ వినియోగించుకుని, ప్రతి ఎకరానూ పచ్చగా చేసుకుని ప్రపంచానికే మరోసారి మార్గదర్శకంగా ఉంటం. జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకుని అమలుచేస్తం. రాష్ట్రం ఏర్పడ్డాక కరెంటుకు కొంత సమస్య ఉంటది. కొంతకాలం ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొని వ్యవసాయం, చేనేత, గృహ, పారిశ్రామికావసరాలను తీరుస్తం. వచ్చే ఐదేండ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుంటం. వీటికి ప్రపంచ, జాతీయ స్థాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటం. థర్మల్, జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ మిగులు రా్రష్ట్రంగా తీర్చిదిద్దుకుంటం. సింగరేణిని సమైక్య ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఓపెన్‌కాస్టులను క్రమబద్ధం చేసి కాపాడుకుంటం.
పెట్టుబడులపై...
దేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ రాష్ట్రంలో 100కు పైగా భారీ పరిశ్రమలుండేవి. సమైక్య రాష్ట్రంలోనే చాలావరకు దివాలా తీయించారు. ఇప్పుడు పెట్టుబడులను ఆహ్వానిస్తం. అయితే గద్దల్లా వచ్చి దోచుకుపోయేవారిని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం కొంత కఠినమైన చట్టాలను అమలుచేస్తుంది. ఆ చట్టాలకు లోబడి పెట్టుబడులను స్వాగతిస్తం. రేట్లను 500 శాతం పెంచిన కాంట్రాక్టర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తం. దరిద్రపుగొట్టు పెట్టుబడిదారులను తరిమేస్తం.
అభివృద్ధి.. సంక్షేమం...
పల్లెలను కాపాడుకుంటూనే పట్టణీకరణ వసతులను పెంపొందించుకుంటం. సేవా రంగం కూడా అద్భుతమైన ఉత్పాదక రంగంగా మారుతుంది. ‘నాకు క్షవరం చేయి, నీ బట్టలు ఉతుకుతా’ అనే విధంగా పరస్పరం సహకరించుకుంటం. యూరప్ తరహాలో రిజర్వ్ ఫారెస్టులను తయారు చేస్తం. కేజీ నుండి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలనేది నా ఆశయం. కులాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ ఉచిత విద్య అందిస్తం. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తం. ప్రతి వ్యవసాయాధారిత దళిత కుటుంబానికీ మూడెకరాల సాగుభూమి, ఏడాది పాటు పెట్టుబడి ఇస్తం. తెలంగాణలో ఖర్చు చేసిన అప్పు తెలంగాణకు, ఆంధ్రాలో చేసిన ఖర్చు ఆంధ్రా వాటాకు పోతయి.
బయ్యారం కచ్చితంగా తెలంగాణదే
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే. అది తెలంగాణకే ఉండాలి. నిజాం ఖజానా ద్వారా నిర్మితమైన రామాలయం ఖమ్మం జిల్లాలోనే ఉండాలి. భద్రాద్రి రామాలయమున్న 30 ఎకరాల భూమి తెలంగాణదే. తహశీల్ రికార్డుల్లో ఆ భూమి ఖమ్మం జిల్లాలోనే ఉంది. పాల్వంచ రాజును రక్షించినందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం రాజు దాన్ని నజరానాగా ఇచ్చిండు. రామదాసు స్వగ్రామం నేలకొండపల్లి కూడా ఖమ్మం జిల్లాలోనే ఉంది. రామదాసును గోల్కొండ కారాగారంలోనే ఉంచిన్రు.
నక్సలైట్లతో చర్చిస్తం
నక్సలైట్ల అజెండా ఆయుధమొక్కటే కాదు. సామాజిక, ఆర్థిక అసమానతలపై పోరాటం అనే బలమైన సైద్ధాంతిక పునాది వారికి ఉంది. ఈ సమస్యపై అనేక మందితో నెలల తరబడి చర్చలు జరిపినం. నక్సల్స్ అజెండాను అమలు చేయాలని టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచీ చెప్తున్నం. ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలె. నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల కోణం నుండి చూడొద్దు. పోలీసులు, హోంమంత్రితో చర్చలు జరిపితే లాభం లేదు. సాంఘిక సంక్షేమ శాఖ, మేధావులు, పత్రికా సంపాదకులు, ప్రజాస్వామికవాదులు చర్చలు జరపాలె. తెలంగాణ ప్రభుత్వం గుండెల నిండుగా చర్చలు చేస్తుంది. దిక్కుమాలిన బూటకపు ఎన్‌కౌంటర్లు తెలంగాణ ప్రభుత్వంలో ఉండవు. ఆయుధం మీద ఆధారపడితే శాంతిభద్రతల సమస్య వస్తది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌పాత్ర
కేసీఆర్ ఏ హోదాలో ఇవన్నీ చెప్తున్నడని అడిగే సన్నాసులుంటరు. నా కల చెప్పిన. 13 ఏండ్లుగా తండాల్లో, దళితవాడల్లో తిరిగిన ఆర్తితో, చూసిన కష్టాలను గుండెల్లో నిక్షిప్తం చేసుకున్న. టీఆర్‌ఎస్‌కే అధికారం వచ్చినా నేను సీఎం అయ్యే ప్రసక్తి లేదు. తల నరుక్కుంట కానీ ఇచ్చిన మాట తప్పను. దళితుడే తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పిన. నాకే ఆ అధికారముంటే మాట నిలుపుకుంట. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే శాసనసభాపక్షం సమావేశమై దళితుడినే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటది. తమ బతుకింతేనని నిరాశలో ఉన్న వర్గాల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికే దళితుడిని సీఎం చేస్తామన్నా. నేను స్టేట్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా ఉంట. కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సొస్తే మన ఆశయాలను చెప్పి అమలు చేయించుకుంట. చేయకుంటె మళ్లీ ఉద్యమ జెండా ఎత్తుతా. ఇప్పటిదాకా ఉద్యమకారుడినే. ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదు. అయితే తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాసవకముందే విలీనం వంటి రాజకీయ అంశాలపై మాట్లాడటం మంచిది కాదు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తది.
Advertisement