సోనియాకి పోటీగా కరీంనగర్ లో కేసీఆర్ సభ
కరీంనగర్‌లో సోనియా సభ జరిగిన తర్వాత అక్కడే అంతకంటే పెద్ద సభను నిర్వహించాలని భావిస్తోంది టీఆర్‌ఎస్. ఈ లోపు నిర్వహించే సభలకు సంబంధించి ఒకటి రెండ్రోజుల్లో షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ నెల 13 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి ముమ్మరప్రయత్నాలు చేస్తోంది టీఆర్‌ఎస్. కాంగ్రెస్ కు క్రెడిట్ దక్కకుండా చేసేందుకు టీఆర్ ఎస్ ప్రయత్నిస్తోంది. ముందుగా తొలి బహిరంగ సభను ఈ నెల 11న కరీంనగర్‌లో నిర్వహించాలని టీఆర్ ఎస్ నేతలు భావించారు. ఈ సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని ప్రసంగించే విధంగా ప్రణాళికను రూపొందించారు. కానీ 16న సోనియా కరీంనగర్ సభలో పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతొ ఆమె బహిరంగ సభ తరువాత శక్తిప్రదర్శన చేయాలన్నది టీఆర్ ఎస్ ఆలోచన.
హెలికాప్టర్ ద్వారా ప్రతి రోజు మూడు నుంచి ఐదు సభల్లో కేసీఆర్ పాల్గొంటారని ఇంతకు ముందు టీఆర్‌ఎస్ అంచనా వేసింది. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వేడి వాతావరణం కారణంగా ఈ సభలను రెండుకే పరిమితం చేయాలని తెలంగాణా రాష్ట్రసమితి యోచిస్తోంది.