* సమైక్య తీర్మానానికి జేఏసీ నేతలు ఒత్తిడి చేయాలి: వైఎస్సార్‌సీపీ
* కిరణ్‌ను, రాజకీయ పార్టీలను గట్టిగా నిలదీయాలి
* అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలి
* ఆ తర్వాత మా రాజీనామాలు ఆమోదింపజేసుకుంటాం
* రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే సమర్థుడు కావాలి
* అలాంటి నాయకుడు జగనేనని ప్రజలంతా నమ్ముతున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభను తక్షణం సమావేశపరచి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ‘‘కేంద్రం కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసే లోపే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మా నం ఆమోదించాలి. దాన్ని కేంద్రానికి పంపి విభజన ప్రక్రియను నిలిపేయించాలి’’ అని కోరింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలంటూ ముఖ్యమంత్రిని, ఇతర రాజకీయ పక్షాలను సీమాంధ్ర జేఏసీ నేతలు గట్టిగా నిల దీయాలని కోరింది. వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం తరఫున నేతలు భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, జి.శ్రీకాంత్‌రెడ్డి, బి.గుర్నాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లను స్వయంగా కలసి శాసనసభను సమావేశపరచాలని విన్నవిస్తామన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ మేరకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. సమైక్య తీర్మానం ఆమోదం పొందాక తమ రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని నిర్ణయించినట్టు శోభ స్పష్టం చేశారు. ‘‘అసెంబ్లీని సమావేశపరిస్తే విభజనపై కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆడుతున్న డ్రామాలు బయటపడతాయి. సమైక్య రాష్ట్రం కోసం ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారో, ఎవరు దొంగ లో తేటతెల్లమవుతుంది’’ అన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టాలని ఇటీవలి వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా తీర్మానించిన విషయాన్ని శోభ ప్రస్తావించారు. రాష్ట్ర విభజన రాజకీయపరమైన నిర్ణ యం కాబట్టి అసెంబ్లీని సమావేశపరచాలంటూ కిరణ్‌ను నిలదీయాలని సీమాంధ్ర జేఏసీ నేతలకు సూచించారు. ‘‘ఎందుకంటే లక్షల మంది ఉద్యోగులు జీతాలు వదులుకుని, తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. నేతలు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. అసెంబ్లీని సమావేశపరిచేలా కిరణ్‌పై, విభజన లేఖను వెనక్కి తీసుకునేలా బాబుపై, సమైక్య తీర్మానం ఆమోదం పొందేలా కాంగ్రెస్, టీడీపీలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
విభజనను ఆపడం చేతగాని నేతలు
విభజనపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ప్రజలను మోసగిస్తోందని శోభ దుయ్యబట్టారు. ‘‘విభజన ప్రక్రియను కొనసాగిస్తున్నామని, కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని కేంద్ర మంత్రులు ఒకవైపు అధికారికంగా ప్రకటిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ నేతలు, కిరణ్ మాత్రం రాజీనామాలు చేయొద్దని చెబుతూ వస్తున్నారే తప్ప విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఢిల్లీలో చెప్పిన కిరణ్, విభజన ప్రకటన తర్వాత 10 రోజుల పాటు ముఖం చాటేశారు. ‘సీఎం కనిపించడం లేదు’ అంటూ పత్రికా ప్రకటనలు వచ్చాక మీడియా ముందుకొచ్చి తాను సమైక్యవాదినంటూ కొత్త పల్లవి పాడుతున్నారు. కేంద్రాన్ని గట్టిగా ఎదిరించి, తమ పార్టీ అధిష్టానాన్ని నిలదీసి విభజనను ఆపగల స్థాయిలో ఉండి కూడా ఆ రోజు అడ్డుకోకుండా ఇప్పుడీ డ్రామాలేమిటి?’’ అంటూ ధ్వజమెత్తారు. విభజన జరగనీయబోమంటూ కిరణ్, కేంద్ర మంత్రులు, మంత్రులు, ఎంపీలంతా కలసి ప్రజల్ని మభ్యపెట్టారని మండిపడ్డారు. కిరణ్ ముఖ్యమంత్రిలా వ్యవహరించడంలేదన్నారు. ఆయన డ్రామాలు ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతగాదని కిరణ్, కేంద్ర మంత్రులు ఆ రోజే చెప్పి ఉంటే ప్రజలే ఆపగలిగి ఉండేవారన్నారు.
నిజాయితీగా పోరాడుతున్నది వైఎస్సార్ సీపీనే
సమైక్యాంధ్రకు మద్దతుగా ముందుగా స్పందించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెసేనని శోభ గుర్తు చేశారు. ‘‘ఏపీ ఎన్జీవోలు డిమాండ్ చేయక ముందే మేం రాజీనామాలు చేశాం. ఇంతవరకూ ఏ పార్టీ అధ్యక్షుడూ రాజీనామా చేయలేదు. కానీ సమైక్యోద్యమానికి మద్దతుగా మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేగాక సమైక్యాంధ్రకు మద్దతుగా వారిద్దరూ వారం రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇన్ని చేసిన మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఏ పార్టీకీ లేదు’’ అని ఆమె స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే సమర్థుడైన నాయకుడు కావాలన్నారు. అలాంటి నాయకుడు జగనేనని ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పారు.
రెండు పార్టీలు ద్రోహులు
రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ అయితే, లేఖలిచ్చి అందుకు సంపూర్ణ సహకారం అందించింది చంద్రబాబని శోభ దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్రకు తీరని ద్రోహం తలపెట్టాయని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు టీడీపీలోని తెలంగాణ నేతలతో ఒకమాట, సీమాంధ్ర నేతలతో మరో మాట మాట్లాడిస్తున్నారు. పైగా ఢిల్లీకి తీసుకెళ్లి డ్రామాలాడిస్తున్నారు. ఇక్కడేమో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చామంటారు. విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడం వల్లే ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో అంటారు. కాబట్టి తెలంగాణలో అదే నినాదంతో వెళ్లి ఓట్లు సంపాదించాలని వారికి చెబుతారు. సీమాంధ్రకు వచ్చి, సమైక్యోద్యమంలో ముందున్న మాపై పడి ఏడుస్తున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ దొందూ దొందే’’ అని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ భేటీతో డ్రామా బట్టబయలు
Published Fri, Sep 27 2013 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 8:52 PM
Advertisement
Advertisement