హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాచరిక పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి శనివారం హైదరాబాద్లో ఆరోపించారు. చంద్రబాబు పాలనను ప్రవాస భారతీయులు కూడా అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై యూఎస్లోని ఉన్నవారిలో ఆందోళన నెలకొందని చెప్పారు. రాజధాని వ్యవహారాన్ని చంద్రబాబు కుటుంబ వ్యవహారంలా భావిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ వాళ్లకు ఓ న్యాయం మిగతా పార్టీలకు మరో న్యాయం చేస్తున్నారని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. గొప్పలు చెప్పడం తప్ప చంద్రబాబు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రలోభాలు, వలసలను అందరూ తప్పుబడుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి గురించి యూఎస్లోనూ చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ విషయాన్ని నిలదీస్తే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో సహా అన్నింటినీ ఢిల్లీలో తాకట్టు పెట్టారని చంద్రబాబుపై శ్రీకాంత్రెడ్డి నిప్పులు చెరిగారు.