
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు తన అబద్దాలను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 2 కోట్ల ఎకరాలు సేంద్రియ ప్రకృతి సాగులోకి తెస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ సోసియో ఎకనామిక్ సర్వే ప్రకారం 61వేల హెక్టార్ల భూమినే మాత్రమే వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారని, ఎరువుల వాడకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందని, ఇలాంటప్పుడు 2 కోట్ల ఎకరాల్లో సేంద్రియ సాగు ఎలా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పశువులను అమ్ముకుంటున్నారని, రాయలసీమలో రైతులు ఆత్మహత్యచేసుకుంటుంటే అక్కడేమో చంద్రబాబు ఫిడెల్ వాయిస్తున్నారని ఎద్దేవ చేశారు.
చంద్రబాబు తన భాషతో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని, ఆయన పబ్లిసిటి మనిషి అని దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికపైనే అసత్యాలు చెప్పారన్నారు. ఎలక్షన్ పాలసీ, రహస్య ఎజెండాతోనే విదేశాలకు వెళ్లడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు. అధికారంలోకి వస్తే ఇంటికి రూ 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో లక్షమంది మాత్రమే అర్హులైన వారున్నారని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.12వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఎదురుదాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. దివంగత వైఎస్సార్ వారుసులమని, తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై విచారణ చేయాలని కోరుతామన్నారు. 2016లో జరిగిన రక్షణ ఒప్పందంపై విచారణ జరిపించాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై అనేక ఉద్యమాలు చేసింది వైఎస్సార్‌సీపీనే అని, హోదాను తాకట్టు పెట్టింది టీడీపీనే అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment