వాహనాలెక్కని జనం!
పలాస,న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు జనం ఎక్కలేదు. రోడ్ షో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పలాస లక్ష్మీపురం టోల్‌గేటుకు కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకోవాల్సి ఉంది. ఆ సందర్భంగా వాహనాలతో పెద్ద ర్యాలీతో స్వాగతం పలకాలని మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం ఇంట్లో కార్యకర్తల సమావేశమై నిర్ణయించారు. జన సమీకరణకు కూడా తగిన చర్యలు తీసుకున్నారు.
అందులో భాగంగానే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలను రోడ్‌షో కార్యక్రమానికి తీసుకురావడం కోసం 50 టాటా మ్యాజిక్ వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వీటిని ఉదయమే పలాస రైల్వే గ్రౌండ్‌లో సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత గ్రామాలకు పంపించారు. అయితే వెళ్లిన వాహనాలు ఖాళీగా తిరిగిరావడంతో వీటిలో 30 వాహనాలను రద్దు చేశారు. వీటిని రద్దు చేయడంతో వాహన డ్రైవర్లు తమకు అద్దెలు చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మిగతా 20 వాహనాలు పలాస, నందిగాం, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లినప్పటికీ వాహనాల్లో ఇద్దరు, ముగ్గురు తప్పా ఎక్కువ రాలేదు. మందస మండలం వీరగున్నమ్మపురం, కుంటికోట గ్రామాలకు వెళ్లిన వాహనాలను అక్కడివారు ఖాళీగా పంపించేశారు.