-భార్యను చంపిన భర్తకు శిక్ష
-సహకరించిన తల్లికి కూడా...
విశాఖ లీగల్/అచ్యుతాపురం: అదనపు కట్నం కోసం కోడల్ని అతి కిరాతకంగా హత్య చేసిన అత్త, భర్తలకు యావజ్జీవ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నగరంలోని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.సత్యానంద్ తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆ తీర్పులో వెల్లడించారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.వేణుగోపాలరావు అందించిన వివరాల ప్రకారం.. నిందితులు ఎలమంచిలి రాంబాబు (35), గోవిందమ్మతో 2008లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.లక్షా 50 వేల కట్నం, తులంన్నర బంగారం, రూ.50వేల ఆడపడుచు లాంఛనాలు ఇచ్చారు.
కొంతకాలానికి అదనపు కట్నం కావాలంటూ అత్త అప్పలనరసమ్మ, భర్త రాంబాబు నిత్యం గోవిందమ్మను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. అన్నం కూడా పెట్టేవారు కాదు. కట్నం తేలేదన్న అక్కసుతో 2013 మార్చి 14వ తేదీన రాత్రి 9.30గంటల సమయంలో గోవిందమ్మ పై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న గోవిందమ్మ నుంచి ఆ మరుసటి రోజు (మార్చి 15)న స్థానిక న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మార్చి 19న మృతి చెందింది.
ఈ మేరకు నిందితులపై సెక్షన్ 498, 304బి, 302 సెక్షన్లతో అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై అప్పటి ఎస్పీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరాభియోగ పత్రంలో పేర్కొన్న 13 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితులపై నేరం రుజువు కావటంతో బుధవారం తీర్పునిచ్చారు.
కట్న పిశాచులకు జీవిత ఖైదు
Published Thu, May 11 2017 8:40 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
Advertisement