తెలంగాణ సీఎం జైపాల్‌రెడ్డేనట: మర్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జైపాల్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన వర్గం నేతలు గట్టిగా ప్రచారం సాగిస్తున్నారని జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరెలాంటి ప్రచారం చేసుకున్నా అంతిమంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటివరకు జాతీయవాదులం, సమైక్యవాదులమన్న వారు కూడా ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు అవుతున్న తరుణంలో తామే అసలైన తెలంగాణ వాదులమంటూ తెరముందుకు వస్తున్నారని అన్నారు. తాము తెలంగాణ కోసం జైళ్లకు వెళ్లిన రోజుల్లో ఈ నేతలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు.
సీఎం రేసులో లేనని, తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వాలు పనిచేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. దీనికోసమే ప్రధానిని, హోం మంత్రిని , జీవోఎంను కలసి వినతిపత్రాలు ఇచ్చానని చెప్పా రు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని అసెంబ్లీలో చర్చ సందర్భంగా సవరణలను ప్రతిపాదిస్తామని, కొత్త రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తకుండా ఉండేం దుకు స్థానాలను పెంచాల్సిన అవసరముందని చెప్పారు.