మండలంలోని కనుపూరు శివారు గ్రామంలో ప్రభుత్వ కొండ భూములను అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా తవ్వేస్తున్నారని వైఎస్సార్ సీపీ
కోరుకొండ : మండలంలోని కనుపూరు శివారు గ్రామంలో ప్రభుత్వ కొండ భూములను అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా తవ్వేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. శనివారం ఆమె కోరుకొండలో మాట్లాడుతూ కొండను తవ్వేస్తున్నారని తహశీల్దార్, ఎంపీడీఓ, మైన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంటి ముందు ఉన్న పల్లం భూమిని పూడ్చడానికి కొండ మట్టిని తవ్వితే కేసులు రాస్తున్న అధికారులు అధికార పార్టీ వారికి మాత్రం కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీలో పలు అక్రమాలు జరిగినా చర్యలు లేవన్నారు.
గామంలో పనులు చేయకుండానే పనులు చేసినట్టు బిల్లులు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి అధికారుల తీరు పై తీవ్రంగా ధ్వజమెత్తారు. వీటన్నింటిపైన మంగళవారం ఉదయం గ్రామంలో పాదయాత్ర చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ కనుపూరులో నెలకొన్న సమస్యల పై ఆందోళన చేపడుతుందన్నారు. ఈమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కళ్యాణం చిట్టిబాబు, జాజుల నాగేశ్వరరావు, కళ్యాణం రాంబాబు, కొత్తపల్లి శ్రీనివాస్, అడపా సురేంద్ర తదితరులు ఉన్నారు.