స్పీకర్ సాబ్.. జర సున్లో..
• సభలో మహిళా ప్రజాప్రతినిధులను మాట్లాడనివ్వండి
• కోడెలను కోరిన జమ్మూకశ్మీర్ ఎమ్మెల్సీ షెహ్‌నాజ్
సాక్షి, అమరావతిబ్యూరో: ‘ఏపీ స్పీకర్ ఇదే వేదిక మీద ఉన్నారు. ఆయన నా మాటలు కాస్త ఆలకించాలి. ఆయనతోపాటు దేశంలోని అందరు స్పీకర్లకు నేను చెప్పేదొకటే. చట్టసభల్లో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైనా అంశంపై ప్రసంగించేందుకు నిలబడగానే స్పీకర్ బెల్ కొట్టేస్తారు. ఇక మేం ఏం మాట్లాడేది? మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గొంతును ఎలా వినిపించాలి? చట్టసభల్లోనే మహిళలు మాట్లాడేందుకు అవకాశం లేకపోతే బయట ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి.
అందుకే చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వండి..’ అని జమ్మూకశ్మీర్ ఎమ్మెల్సీ డాక్టర్ షెహ్‌నాజ్ కోరారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు రెండోరోజు ఆమె మాట్లాడారు. చట్టసభల్లోనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు తమ స్వరాన్ని బలంగా వినిపించాల్సిన ఆవస్యకత ఉందన్నారు. ప్రపంచం మహిళల వాదన వినాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు.