'స్పీకర్ తీరు అత్యంత దురదృష్టకరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి నోటీసులు అందజేశారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. కోడెల స్పీకర్ అయినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా ఉండాల్సింది పోయి టీడీపీ సభ్యుడిగా అనేక సందర్భాల్లో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
'కోడెల సభాపతి.. అన్నివిధాలా గౌరవంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేందుకు సహకరించారు. సభాపతి పదవి మీద గౌరవంతో మేమంతా సహకరించాం. కానీ ఆయన టీడీపీ సభ్యుడిగా అనేక సందర్భాల్లో వ్యవహరించారు. గత శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా మీద ఎలాంటి చర్య తీసుకున్నారో అందరూ చూశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక తప్పుడు రూల్ కింద రోజా సస్పెన్షన్‌కు ప్రతిపాదించారు. ఆ రూల్ కింద సంవత్సర కాలం పాటు ఒక సభ్యురాలిని సస్పెండ్ చేసే అధికారం లేదని మేం స్పష్టంగా చెప్పాం' అని సుజయ్కృష్ణ రంగారావు చెప్పారు.