‘జన్‌ధన్’తో పేదలకు మేలు
శ్రీకాకుళ అర్బన్: ప్రధాన మంత్రి జన్ధన్ యోజన పేదలకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పథకం కింద ప్రతి కుటుంబం రెండు ఖాతాలు తెరిచేలా బ్యాంకులు కృషి చేయాలని శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు కోరారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు.
కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. జేసీ జి.వీరపాండ్యన్, ఆంధ్రాబ్యాంకు ఎల్‌డీఎం ఎం.రామిరెడ్డి, తదితరులు మాట్లాడారు. అంతకుముందు అతిథులు వివిధ బ్యాంకుల ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. కార్యక్రమంలో ఏజేసీ షరీఫ్, ఎస్‌బీఐ ఏజీఎం రాజారామ్మోనరావు, ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ బి.ఎస్.ఎన్.రాజు, నాబార్డు ఏజీఎం వాసుదేవన్, ఆంధ్రాబ్యాంకు ఏజీఎం రాజేంద్రకుమార్, సిండికేట్ బ్యాంకు ఏజీఎం సాంబిరెడ్డి, ఇతర బ్యాంకు అధికారులు, జిల్లాలోని శాఖాధికారులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో బ్యాంకులది కీలకపాత్ర
దేశాభివృద్ధిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఆయన జన్‌ధన్ యోజన ప్రారంభం సందర్భంగా ఖాతాలు తెరిచే కార్యాక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని రూపుమాపి అవినీతి రహిత దేశంగా రూపొందించేందుకు ప్రధానికి అంతా సహకరించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదరికం లేని భారతదేశానికి ప్రధాని, ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని, వారికి అంతా అండగా నిలవాలన్నారు. ఎస్‌బీఐ ఏజీఎం కె.కామేశ్వరరావు మాట్లాడుతూ జీరో అకౌంట్‌తో ఖాతాలను ప్రారంభించే ఈ కార్యక్రమానికి అనూహ్యై స్పందన వచ్చిందన్నారు.
ఆధార్ లేదా ఏదో ఒక గుర్తింపు కార్డుతో వ్యక్తిగత చిరునామాతో అకౌంట్ ప్రారంభించవచ్చునన్నారు. నెలలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త ఖాతాదారులకు పాస్‌బుక్‌లను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు ఎస్.ఎం.బాషా, ఉదయకుమార్‌సింగ్, కార్యక్రమ నిర్వాహకుడు బి.శ్రీనివాసరావు, యూనియన్ సభ్యుడు ఎం. రమేష్, ఐ.జగన్నాధరావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.