బాలారిష్టాల్లో ‘మెప్మా’ ! | PM 'Jan Dhan' Yojana launched; aims to open 1.5 crore | Sakshi
Sakshi News home page

బాలారిష్టాల్లో ‘మెప్మా’ !

Published Fri, Aug 29 2014 1:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

బాలారిష్టాల్లో  ‘మెప్మా’ ! - Sakshi

బాలారిష్టాల్లో ‘మెప్మా’ !

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :  పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఏర్పాటైన ‘మెప్మా’ (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. 2007లో జిల్లా యూనిట్‌గా కేం ద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ పథకం క్షేత్రస్థాయిలో లక్ష్యాల్ని సాధించలేకపోతోంది. జిల్లాలో రెండేళ్ల క్రితం అట్టడుగుస్థాయిలో ఉన్న ఈ పథకాన్ని ప్రస్తుత సిబ్బంది ముందుకు తీసుకువెళ్తున్నా ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందని ఉద్యోగులే చెబుతున్నారు.
 
 ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు మోకాలడ్డు
 ఈ పథకాన్ని ఇప్పటికీ వివిధ విభాగాల సహాయంతోనే నడిపిస్తున్నారు. డిప్యుటేషన్లపై సిబ్బందిని రప్పించి, మరికొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోనే అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో పీడీతో పాటు ఆరుగురు పీఆర్‌పీ (పావర్టీ రీసోర్స్ పర్సన్), మున్సిపాలిటీ అనుబంధ విభాగ సిబ్బందిగా మరో 24 మంది, స్థానిక కార్యాలయంలో 11 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ఆరుగురే ఉండగా.. మిగతా వారు పొరుగు సేవల విభాగం (ఏజెన్సీ) కింద వచ్చినవారే. వీరు ఎప్పుడుంటారో, ఎప్పుడు బయటకు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. సంస్థలో కొన్నాళ్ల పాటు శిక్షణ పొందిన సిబ్బంది బయటకు వెళ్లిపోతే వీరి స్థానంలో వచ్చే కొత్త సిబ్బంది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబెడతారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జూలై 31తో గడువు ముగిసినా ప్రభుత్వం డిసెంబర్ వరకు గడువు పొడిగించింది.
 
 అయితే పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే మెప్మా నిర్వహకులుగా ప్రభుత్వం నియమిస్తే ఫలితాలుంటాయని ఆ శాఖ సిబ్బందే చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కొన్ని నిధులు, కేంద్రం నుంచి సబ్సిడీ, బ్యాంకుల నుంచి లింకేజీలతోనే ప్రస్తుతం నడుస్తోంది. ప్రత్యేక వ్యవస్థగా గుర్తిస్తే ఇతర ప్రభుత్వ విభాగాలుగా పట్టణ పేదలకు మరింత సేవలందించవచ్చని సిబ్బంది చెబుతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సహాయంతో సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టి, సొసైటీ యాక్ట్ ప్రకారం కాకుండా స్వతంత్ర కమిటీలతో మెప్మాను పరిగణించాలని కోరుతున్నారు. ఇప్పుడున్న సిబ్బందికి మూడింతల సిబ్బంది అవసరం కూడా ఉంది. వీరికిచ్చిన శిక్షణ ఆధారంగానే క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు, మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
 
 గ్రామీణ స్థాయిలోనూ..
 గతంలో మెప్మా ఆధ్వర్యంలోని పలు పథకాలు పట్టణాల్లోని పేదలకే వర్తించేవి. అయితే కేంద్రం ఇటీవల పథకాల్లో మార్పులు తెచ్చి గ్రామీణ నిరుపేదలు, నిరుద్యోగులకూ వర్తించేలా చట్టం చేసింది. వాస్తవానికి గ్రూపులుగా సభ్యులేర్పడి కేవలం మహిళలకే పథకాలు వర్తించేలా తొలుత ఈ పథకం ప్రారంభమైనా రాన్రాను అన్ని వర్గాలకూ (తెల్లరంగు రేషన్ కార్డు ఉన్న వర్గాలు) చేరేలా మార్పులు చేశారు. జిల్లాలో 4,733 స్వయం సహాయక (ఎస్‌హెచ్‌జీ) గ్రూపులున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించిన రుణమాఫీ ఈ గ్రూపులకూ వర్తిస్తుందని ప్రకటించడంతో ఆయా సంఘాల సభ్యులు సకాలంలో బ్యాంకులనుంచి తీసుకున్న రుణాల్ని చెల్లించలేకపోయారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ రుణాలు మాఫీ అయిపోతాయని భావించినా, బ్యాంకు నిబంధనలు, ప్రభుత్వ ఆంక్షలు వెరసీ వీరు తీసుకున్న మొత్తాలకు భారీగా వడ్డీ చెల్లించాల్సివస్తోంది. ఇది మహిళలకు శరాఘాతంలా మారింది. కొన్ని ప్రాంతాల్లో మెప్మా పథకాల కింద రుణాలు పొందిన  సంఘాలకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం, ఆర్ ఆర్ యాక్టు కింద రికవరీ చేస్తామని హెచ్చరికలు వస్తున్నా.. ఈ పథక నిర్వహకులు, అధికారులు, ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతోంది.
 
 ప్రచారమూ కరువే..
 మెప్మా సంస్థ జిల్లాలోని పట్టణ స్వయం ఉపాధి (అర్బన్ సెల్ఫ్ ఎంప్లాయూమెంట్) సెర్ఫ్, బంగారుతల్లి, స్వయం ఉపాధి కార్యక్రమం (ఎస్‌ఈపీ), వీధి వ్యాపారుల పాలసీ, సిటీ లైవ్‌లీ హుడ్ సెంట ర్లు, పట్టణ, గ్రామీణ పేదలకు వర్తించే ఈ తరహా అన్ని కార్యక్రమాల్లోనూ అవగాహన లోపం కనిపిస్తోంది. స్పెషలాఫీసర్ల కింద ఈ సంస్థలో కొంతమంది సిబ్బంది పనిచేస్తూ శిక్షణ కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో లక్ష్యాలు లేవు. పేదలకు రక్షణగా భవిష్యత్తులో ఈ యూనిట్ అధికారులు మరిన్ని కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నా.. సిబ్బంది కొరత కారణంగా ఇప్పుడున్న పథకాలకే ప్రచారం కరువవుతోంది. కొత్త పథకాల పరిస్థితి మరెలా ఉంటుందో చూడాలి. బడ్జెట్ కేటాయింపుల్లోనూ మెప్మా పథకాల ప్రచారానికి సంబంధించి నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిక్షణ కార్యక్రమాలకూ డబ్బులు రావడం లేదు. అలాగే నిధులు లేక సంబంధిత కార్యాలయాలు  అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement