జనగణమన అధినాయక జయహే.. | jana gana mana song 6thousand students | Sakshi
Sakshi News home page

జనగణమన అధినాయక జయహే..

Published Sun, Dec 28 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

జనగణమన అధినాయక జయహే..

జనగణమన అధినాయక జయహే..

భావిభారత  పౌరులు వేలాదిగా ఒక్కచోట చేరారు. గళాలన్నీ ఒక్కటిగా చేసి జాతీయ గీతం ఆలపిస్తుంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ దేశభక్తి ఉప్పొంగింది. సమైక్యతా భావం తొణికిసలాడింది. భరతమాత సేవలో మేము సైతం అంటూ కదం తొక్కే ఉత్సాహం కనిపించింది.
 
జాతీయ గీతాన్ని ఆలపించిన 6 వేల మంది విద్యార్థులు
ప్రొద్దుటూరు కల్చరల్: జయహో జనగణమన చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు ఆవరణంలో పలు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 1911 డిసెంబరు 27వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించి ఆలపించిన సందర్భంగా అందరిలో ఐక్యతాభావం, జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు, మహనీయులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు.

ఉదయం 10 గంటలకు సుమారు 6 వేల మంది విద్యార్థులు మైదానానికి చేరుకున్నారు. మాజీమున్సిపల్ చైర్మన్ నరాల బాలిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రుల ప్రసంగాన్ని ఆడియో టేపుల ద్వారా విద్యార్థులకు వినిపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఆలపించిన జాతీయ గీతాన్ని వినిపిస్తూ అందరూ ఏక కంఠంతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

దేశ ఔన్నత్యాన్ని అందరికి తెలియజేసేందుకు జయహో జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహక అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జునరావు, మహబూబ్‌బాషా తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన  వ్యాసరచన, వక్తృత్వ, పరుగు, చిత్రలేఖనం, లాంగ్‌జంప్, హైజంప్ తదితర పోటీలలో గెలుపొందిన వారికి పతకాలను తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి తదితరులు అందజేశారు. స్పందన సుబ్బరామిరెడ్డి, ఆడిటర్ సాధు గోపాలకృష్ణ,  ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకరరెడ్డి, కేవీ రమణారెడ్డి, ఆర్‌సీపీఈ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, బాలసుబ్బారెడ్డి, న్యాయవాది కొండారెడ్డి, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement