చిన్నా కుటుంబానికి చెందిన ఐదు నెలల బాలుడికి రవిశంకర్ అని పేరు పెడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్
సాక్షి, విశాఖపట్నం: ‘ఇచ్చాపురం నుంచి మొదలైన జనసేన పోరాటయాత్ర ఉత్తరాంధ్రకు సం బంధించి ముగిసింది. ఈ యాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వ్యధలు స్వయంగా చూశా ను. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనానికి వ్యతిరేకంగా పోరాడతాను‘ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
విశాఖలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007లో పార్టీ పెట్టాలన్న బలమైన సంకల్పం తప్ప తన దగ్గర ఏమీ లేదన్నారు. ఆ సంకల్పంతోనే జనసేన పుట్టిందని చెప్పారు. జనసేన మహిళలను గౌరవిస్తుందని, జనసైనికులు కూడా ప్రతి మహిళను గౌరవించాలని, వారికి అండగా నిలవాలని పిలుపునిస్తానన్నారు. త్వరలోనే మహిళలతో విశాఖలోనే ఆత్మీయ సదస్సు పెడతానని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం జరగాలంటే బలమైన సంకల్పంతో పాటు నిజాయితీ కూడా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్టీ విస్తరణ కోసం మేధావులతో చర్చిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో వ్యాపారాలు దెబ్బతింటాయన్న ఆలోచనతోనే ఆంధ్రప్రాంత నేతలు రాష్ట్ర విభజన నాడు నోరు మెదపలేదన్నారు.
వారితో చర్చలకు సిద్ధం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు, లోకేష్ ఒకే వేదిక పైకి వస్తే రాష్ట్రంలోని సమస్యలపై వారితో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ చెప్పారు. సమస్యలను పరిష్కరించగలగి సత్తా వారికి ఉందన్నారు. విభజన హామీలు, మైనింగ్ పాలసీ, గిరిజన సమస్యలపై చర్చకు రావాలని పవన్‌కల్యాన్ పిలుపు నిచ్చారు. 2050లో విశాఖ ఎలా ఉండాలో మీరు చెబుతారా లేకపోతే నన్ను చెప్పమంటారో చెప్పండని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఏర్పాటుకు 26 వేల ఎకరాలు తీసుకుని మూడు వేల ఎకరాల్లో పెట్టారన్నారు. ఇప్పుడు రాజధాని కోసం లక్షల ఎకరాలు సేకరిస్తున్నారని, ఇప్పటికే అమరావతిలో భూమిని కొంతమంది బడా నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని ఆయన చెప్పారు.
బాధితులకు ఆర్థిక సాయం
సాగర్‌నగర్(విశాఖ తూర్పు): ఇటీవల తుని, మాకవరపాలెం ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్ పర్యటనలో ప్రమాదవశాత్తు చనిపోయిన రెండు కుటుంబాలకు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆర్థిక సాయం చేశారు. తునికి చెందిన భీమవరపు శివ కుటుంబానికి రూ.3 లక్షలు, భీమవరపు చిన్నా కుటుంబానికి రూ.2.50 లక్షలు, వారి పిల్లల చదువు కోసం రూ.1 లక్షల చెక్కును పవన్‌కల్యాణ్ అందించారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకొనేందుకు కార్మికుల సంఘం ప్రతినిధులకు రూ.2.5 లక్షల చెక్కును ఆయన అందించారు. తర్వాత మృతుల చిన్నపిల్లలకు కార్యకర్తల సమక్షంలో పవన్‌కల్యాణ్ పేర్లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment