
సాక్షి,తాడేపల్లి : గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో ఒకేసారి లక్షా 27 వేల పోస్టులు భర్తీ చేయడం ఒక చరిత్ర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువ మంది అర్హత సాధించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మొదటి ర్యాంక్ వస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాధాకృష్ణ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కాలని వాళ్లిద్దరూ కంకణం కట్టుకున్నారని , అందుకే బీసీ నేతలను బాడుగ నేతలుగా రాధాకృష్ణ తన పేపర్‌తో పాటు చానెల్‌లో బహిరంగంగానే అభివర్ణించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరొకరు సీఎం కాకూడదని రాధాకృష్ణ ఉద్దేశమని, పత్రికను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వెళ్లగక్కారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని , చంద్రబాబు, రాధాకృష్ణ కలిసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment