డోంట్ కేర్ | Janmabhoomi program not Care Pothula Suneetha | Sakshi
Sakshi News home page

డోంట్ కేర్

Published Tue, Oct 7 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

డోంట్ కేర్

డోంట్ కేర్

ఇదో జన్మభూమి కార్యక్రమం. ఇందులో అధికారులు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రమే పాల్గొనే ఓ అధికార కార్యక్రమం.  కానీ చీరాల నియోజకవర్గంలో ఛీత్కార రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారులు అడ్డుపడినా, పోలీసులు అభ్యంతరాలు పెట్టినా డోంట్‌కేర్ అంటూ చీరాల టీడీపీ ఇన్‌ఛార్జి పోతుల సునీత దౌర్జన్యాలకు పాల్పడడంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.  రెండు రోజులుగా ఇదే తరహా బెదిరింపులకు దిగుతుండడంతో దీర్ఘకాలిక సెలవులే శరణ్యమంటున్నారు సిబ్బంది.
 
 చీరాల:రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఒంటెత్తు పోకడలతో జన్మభూమి గ్రామసభలు రణరంగాలుగా మారుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం సంగతేమో కాని..దూషణలు, కుమ్ములాటలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలం కదా... మమ్మల్ని ఎవరేంచేస్తారు...అనే అహంకార ధోరణితో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చీరాల గాంధీనగర్‌లో సోమవారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో ప్రొటోకాల్ వివాదంతో ఘర్షణ నెలకొనడంతో అధికారులు సభను రద్దు చేశారు. టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతుల సునీత గ్రామంలో జరుగుతున్న జన్మభూమి గ్రామసభకు హాజరై నేరుగా వేదికపైకి వచ్చి కూర్చున్నారు.
 
 అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికపై ఉండాలనే నిబంధన ఉన్నా సునీత వేదికపై కూర్చోవడాన్ని గ్రామ సర్పంచ్ తాతా సుబ్బారావు, ఈవోఆర్డీ పీ శంకరరెడ్డి, ఉపసర్పంచ్ వెంకయ్య, ఇతర పాలకవర్గ సభ్యులు ఆక్షేపించారు. ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయలేని కారణంగా..ఈవోఆర్డీ వేదికపై నుంచి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల అధికారులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వేదికపై ఉన్న సునీత మాత్రం జన్మభూమిని నిర్వహించాలని పట్టుబట్టారు. దీనికి గ్రామసర్పంచ్ సుబ్బారావు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సునీత సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు.  ఁనేను అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ని..నేను చెప్పిందే చేయాలి...సభ జరగాల్సిందే...ఒప్పుకోకపోతే వెళ్లిపో సభను నేను జరుపుతాననిరూ. సర్పంచ్‌ని అగౌరవంగా దూషించారు. ఒక దశలో అధికారులు, పోలీసులు చూస్తుండగానే సర్పంచ్‌పై దాడికి యత్నించారు.
 
 వయస్సులో పెద్దవాడినైనా తనను టీడీపీ నేత సునీత దూషించడం, హెచ్చరికలు జారీచేయడంతో తీవ్రమనోవే దనకు గురైన సర్పంచ్ జన్మభూమిని గ్రామంలో రద్దు చేస్తున్నానని, అధికారులు, ప్రజలు తనను క్షమించాలని కోరారు. సునీత మాత్రం బలవంతంగా మైకును తీసుకుని సభలో మాట్లాడారు. దీన్ని అడ్డుకోబోతున్న ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు, టీడీపీ నేత సునీత వర్గీయుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఒక దశలో పరిస్థితి చేయిదాటిపోయేలా ఇరువర్గాల నాయకులు బలప్రదర్శనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పి ఆందోళనకారులను పంపించి వేశారు. సభ లో కేవలం గ్రామస్తులు, అధికారులు మాత్రమే ఉండాలని సీఐ భీమానాయక్ మైకులో హెచ్చరించినా పోతుల సునీత వర్గీయులు, టీడీపీ విభాగాల నాయకులు మాత్రం సభాప్రాంగణాన్ని వదల్లేదు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి.
 
 అయితే టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున వచ్చి కయ్యానికి కాలుదువ్వారు. నాయకులు రావడంతో అధికారులు గాంధీనగర్‌లో జరగాల్సిన జన్మభూమిని రద్దు చేశారు. మండల స్థాయి అధికారులను, పోలీసులను సైతం పోతుల సునీత బహిరంగంగానే అగౌరవంగా మాట్లాడటంతో సభలో గందరగోళం నెలకొంది. సునీత వాఖ్యలకు నిరసనగా అధికారులంతా సభను వాకౌట్ చేశారు. ఒన్‌టౌన్ సీఐ భీమానాయక్, ఎస్సైలు శ్రీహరి, రామానాయక్, పోలీసు సిబ్బంది, ప్రత్యేక పోలీసులు 20 మంది వచ్చి ఆందోళనకారులను పంపించివేశారు. తహశీల్దార్ బి.సత్యనారాయణతో సునీత మాట్లాడుతూ సీఏం ఆదేశాలున్నాయని అందుకే సభలకు వస్తున్నానని, అడ్డుచెప్పేహక్కు మీకు లేదన్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ జన్మభూమి అధికారిక కార్యక్రమమని, మీకు వేదికపైకి వచ్చే హక్కులేదనితేల్చి చెప్పగా జన్మభూమి వేదికల్లో పాల్గొనేందుకు మంత్రి వద్ద నుంచి అనుమతి పత్రం తీసుకుని వచ్చి పాల్గొంటానని..అప్పుడు ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సునీత హెచ్చరించడం గమనార్హం.
 
 ‘జన్మభూమి’కి మేం రాం..రాం !
 = మూకుమ్మడి సెలవు పెట్టే యోచనలో మండల అధికారులు
 = ఉన్నతాధికారులకు ఫిర్యాదు
 చీరాలటౌన్: చీరాల మండల స్థాయి అధికారులు జన్మభూమి కార్యక్రమానికి రాలేమంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు రాజకీయ నేతల ఘర్షణలు, వాగ్వాదాల కారణంగా ఁజన్మభూమిరూ.కి రావాలంటేనే జంకుతున్నారు. మండలంలో జన్మభూమి- మా ఊరు  గ్రామసభలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ నేతల తీరుతో రణరంగాలుగా మారడంతో అధికారులంతా మూకుమ్మడి సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగర్ కాలనీ, గాంధీనగర్ పంచాయతీల్లో జరగాల్సిన జన్మభూమి కార్యక్రమాలు నేతల ఘర్షణలతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో, తహశీల్దార్‌తో సహా ఇతర శాఖల అధికారులు సెలవు పెట్టే ఆలోచనలో ఉన్నారు. సోమవారం జరిగిన పరిణామాలతో విసుగు చెందిన అధికారులు కలెక్టర్, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి, జన్మభూమి ప్రత్యేకాధికారులకు సంఘటనలపై వివరంగా తెలియజేస్తూ లిఖితపూర్వకంగా అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు. జన్మభూమి కార్యక్రమాలకు అడ్డు తగలకుండా గట్టి బందోబస్తు అందించి, సజావుగా జరిపేందుకు చర్యలు చేపడితేనే తాము వస్తామని లేకుంటే సామూహిక సెలవులు తీసుకుంటామని మండల అధికారులు తెలిపారు.
 
 మనస్తాపానికి గురై సభను రద్దుచేశా
 గ్రామ ప్రథమ పౌరుడినైన నన్ను ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ సునీత అగౌరవపరిచారు. వేదికపైకి వచ్చినందుకు అడ్డుచెప్పిన నన్ను దూషించినందుకు నిరసనగా జన్మభూమి సభను రద్దుచేశా. గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు మాత్రమే సభకు హాజరై పోలీసులు సహకారం ఉంటేనే సభను నిర్వహిస్తా.
 - తాతా సుబ్బారావు, గాంధీనగర్ సర్పంచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement