
‘జన్మభూమి'లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఊట్లపల్లి(బాలాయపల్లి): ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న బంగారుతల్లి, జననీసురక్ష పథకాలకు తమ పిల్లలను ఎంపిక చేయలేదనే మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దింగి అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఊట్లపల్లిలో సోమవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో చోటుచేసుకుంది. బాలాయపల్లి మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన చింతలపూడి సుబ్బారావుకు ఇద్దరు కుమార్తెలు.
వారు పుట్టినప్పటి నుంచి బంగారుతల్లి, జననీ సురక్ష పథకాలను వర్తింపజేయాలని పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగాడు. రచ్చబండ, గ్రామసభలు తదితర కార్యక్రమాల్లో అర్జీలు ఇచ్చినా పలితం కరువైంది. ఈ క్రమంలో అధికారులు తన విషయంలో కక్షసాధింపుగా వ్యవహరిస్తున్నారనే మనస్థాపానికి గురైన సుబ్బారావు జన్మభూమి గ్రామసభలో విషగుళికలు తినేందుకు యత్నించాడు.
వెంటనే కానిస్టేబుళ్లు మనోహర్, నరేష్ అడ్డుకున్నారు. సుబ్బారావు ఆత్మహత్యాయత్నం చేయడంపై తహశీల్దార్ సీతారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు అర్హత ఉంటే తప్పకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, ఆత్మహత్యాయత్నం చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారికి ప్రభుత్వ పథకాలు వర్తించే అంశాన్ని పరిశీలించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బుజ్జమ్మను ఆదేశించారు. సీడీపీఓ అనురాధతోనూ ఫోన్‌లో మాట్లాడారు. సుబ్బారావు అర్జీని ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు.