జసిత్‌ క్షేమం  | Jasith Released kidnappers Father Thanks CM Jagan | Sakshi
Sakshi News home page

జసిత్‌ క్షేమం 

Published Fri, Jul 26 2019 4:53 AM | Last Updated on Fri, Jul 26 2019 4:54 AM

Jasith Released kidnappers Father Thanks CM Jagan - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నయీం అస్మి  

సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జసిత్‌ కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది.  కిడ్నాపర్లు బాలుడిని బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో (తెల్లవారితే గురువారం) లొల్ల–కుతుకులూరు చింతలరోడ్డులో ఇటుకల బట్టీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో 60 గంటలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది.  మండపేట పట్టణంలో ఈ నెల 22 రాత్రి ఏడు గంటల సమయంలో నాయనమ్మతో కలసి అపార్టుమెంట్‌ లోకి వెళుతున్న నాలుగేళ్ల బాలుడు జసిత్‌ను అపరిచితులు కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు అహోరాత్రులు శ్రమించినా కిడ్నాపర్ల ఆచూకీ లభించలేదు. ఆరుగురు డీఎస్పీలు, 10 మంది సీఐల నేతృత్వంలో దాదాపు 500 మంది పోలీసులతో 17 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మ రంగా వెతుకలాట మొదలుపెట్టారు. స్వయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీమ్‌ అస్మితో గడచిన రెండు రోజులుగా మాట్లాడటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.

ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రాయవరం మండలం లొల్ల–కుతుకులూరు చింతలరోడ్డులోని ఇటుకల బట్టి వద్ద బాలుడిని కిడ్నాపర్లు విడిచిపెట్టారు. అదే సమయంలో ఇటుకల బట్టీలో పనిచేసే ఏసు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లేందుకు బయటికిరాగా.. బాలుడు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ముఖానికి మాస్కులు, హెల్మెట్‌ ధరించిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని విడిచి వెళ్లిపోవడంతో అతను దిక్కుతోచని స్థితిలో తన యజమాని కృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు అందించాడు. యజమాని తెల్లవారుజామున 4 గంటల సమయంలో బట్టీ దగ్గరికి వెళ్లి చూసి.. కిడ్నాప్‌కు గురైన బాలుడిగా గుర్తించారు. పిల్లాడు ఆకలిగా ఉందని చెప్పడంతో ఇడ్లీ తినిపించారు. తర్వాత అందుబాటులో ఉన్న నంబర్లతో జసిత్‌ తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఎస్పీ నయీం అస్మికి సమాచారం అందడంతో ఆయన చింతలరోడ్డుకు వెళ్లి బాలుడిని తీసుకుని 7 గంటల సమయంలో మండపేటలోని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. బాలుడు సురక్షితంగా ఇంటికి చేరడంతో మూడు రోజులుగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

వీడని కిడ్నాప్‌ మిస్టరీ.. 
బాలుడు క్షేమంగా ఇంటికి చేరినా కిడ్నాప్‌నకు దారితీసిన కారణాలపై ఇంతవరకూ పోలీసులు నిర్ధారణకు రాలేకపోయారు. ఎవరు చేశారో? ఎందుకు చేశారో, వారి లక్ష్యమేమిటో, ఒక వేళ కిడ్నాపర్లకు డబ్బులే కావాలనుకుంటే మండపేటలో ఎంతో మంది కోటీశ్వరుల పిల్లలుంటే బ్యాంకు ఉద్యోగుల కుమారుడు జసిత్‌నే ఎందుకు ఎంచుకున్నారనే అంశాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.  జసిత్‌ రోజూ ఆడుకునే ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన సీసీ ఫుటేజీ లభ్యం కావడంతో ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నారు. కిడ్నాప్‌నకు క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం ఏదైనా కారణమై ఉంటుందా అనే అనుమానాన్ని కూడా పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

‘నానిని కొట్టి నన్ను ఎత్తుకెళ్లిపోయారు’  
‘నాని నేను ఆడుకుని ఇంటికి వెళుతుంటే ఇద్దరు వ్యక్తులు నానిని కొట్టి నన్ను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని ఎత్తుకెళ్లిపోయారు. ఒక అబ్బాయి పేరు తెలుసు. ఆ అబ్బాయి పేరు రాజు. నన్ను తీసుకువెళ్లి ఒక ఇంటిలో పెట్టారు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు రోజూ ఇంట్లో ఇడ్లీ పెట్టేవారు. నన్ను ఏమీ అనలేదు. నన్ను ఎవరూ కొట్టలేదు. మమ్మీ డాడీ కావాలని ఏడుస్తుంటే బట్టీ కార్మికుడిని చూపించి ఆ ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పి నన్ను అక్కడ వదిలేశారు. నేను ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లిపోతే నన్ను ఇంటిలోకి తీసుకువెళ్లిపోయాడు. మీ అందరికీ థాంక్స్‌..’ అని మీడియాతో జసిత్‌ చెప్పాడు. 

ఎస్పీని అభినందించిన సీఎం జగన్‌ 
బాలుడిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేసిన జిల్లా ఎస్సీ నయీం అస్మిని, ఇతర సిబ్బందిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో అభినందించారు.  డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కూడా కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు 
మా బాబు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంలో చొరవ తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఆయనకు రుణ పడి ఉంటాం. థాంక్స్‌ టూ సీఎం సర్‌. ఎవరు కిడ్నాప్‌ చేశారో? ఎందుకు చేశారో తెలియడం లేదు.  
– వెంకటరమణ, జసిత్‌ తండ్రి 

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం 
 కిడ్నాప్‌నకు గల కారణాలను అన్వేషిస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్టు తెలిసింది. ఒక చిన్న ఇంటిలో బాబును ఉంచారు. ఆ ఇంటిలో ఒక మహిళ, చిన్న పాప ఉన్నట్టు తెలిసింది.
 – నయీమ్‌ అస్మి, ఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement