జసిత్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు? | Police Investigating For Mandapeta Kinapers In East Godavari | Sakshi
Sakshi News home page

జసిత్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు?

Published Sat, Jul 27 2019 9:47 AM | Last Updated on Sat, Jul 27 2019 6:16 PM

Police Investigating For Mandapeta Kinapers In East Godavari - Sakshi

బాలుడు జసిత్‌ను కిడ్నాపర్లు వదిలి వెళ్లిన చింతలరోడ్డు

సాక్షి, మండపేట(తూర్పు గోదావరి) : రాష్ట్రంలో సంచలనం కలిగించిన మండపేటలో బాలుడి కిడ్నాప్‌ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. బాలుడు జసిత్‌ క్షేమంగా ఇంటికి చేరడంతో కథ సుఖాంతమైనా కిడ్నాప్‌కు గల కారణాలు ఇంకా అంతుచిక్కడం లేదు. బాబును ఎత్తుకు వెళ్లింది ఎవరు? వారి లక్ష్యం ఏమిటో? అర్థం కాని పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. తొలుత 17 బృందాలు ఏర్పాటు చేయగా అదనంగా మరో మూడు బృందాలను ఏర్పాటుచేశారు. జషిత్‌ను కిడ్నాపర్లు విడిచిపెట్టిన సరిహద్దు గ్రామాల్లో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. మండపేటలో బ్యాంకు ఉద్యోగులు నూకా వెంకటరమణ, నాగావళి దంపతుల నాలుగేళ్ల కుమారుడు జసిత్‌ ఈనెల 22న కిడ్నాప్‌ గురై 25వ తేదీ ఉదయం క్షేమంగా తల్లిదండ్రులను చేరిన విషయం విదితమే. 60 గంటల పాటు సాగిన ఉత్కంఠతకు తెరపడినా కిడ్నాప్‌కు గల కారణాలు తెలియరాలేదు.

దాదాపు మూడు రోజుల పాటు జషిత్‌ను కిడ్నాపర్లు తమ వద్ద బందీగా ఉంచుకున్నా వారి  డిమాండ్లు ఏమిటనేది చెప్పలేదు. వారి వద్ద నుంచి ఒక్క ఫోన్‌ కాల్‌ కూడా రాలేదని పోలీసులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలన కలిగించిన ఈ కేసు విషయమై స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ఎస్పీ నయీం అస్మీతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మూడు రోజుల పాటు స్వయంగా ఎస్పీ మండపేటలోనే మకాం వేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం, అనుమానితుల సీసీ ఫుటేజీ లభ్యమవడం, మీడియా ద్వారా కిడ్నాప్‌ వ్యవహారం వైరల్‌ కావడంతో కిడ్నాపర్లు జడిసి బాబును విడిచిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

ఆ రెండు గ్రామాలపై నిఘా..
కిడ్నాపర్లు జసిత్‌ను విడిచిపెట్టిన చింతలరోడ్డు పరిధిలోని రాయవరం మండలం లొల్ల, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ రెండు గ్రామాల పరిధిలోనే జసిత్‌ను దాచి ఉంటారని భావిస్తున్నారు. మండపేట, కుతుకులూరు ప్రాంతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆ కోణంలోను పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలో పట్టుబడిన బుకీలను విచారిస్తున్నట్టు తెలిసింది. అలాగే జసిత్‌ తండ్రి పనిచేస్తున్న బ్యాంకులో అతడి ప్రవర్తనపై శుక్రవారం విచారణ జరిపినట్టు సమాచారం. కిడ్నాపర్లలో ఒకరి పేరు రాజు అని జసిత్‌ చెప్పడంతో రాజు అనే పేరుతో ఆయా గ్రామాల్లో ఉన్న ఇళ్లను పరిశీలిస్తున్నారు. అతి త్వరలో కిడ్నాప్‌ కేసు మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి అడిషనల్‌ ఎస్పీ ఎస్‌వీ శ్రీధరరావు మండపేట చేరుకుని సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తదుపరి కార్యచరణపై చర్చించారు. 

ఎవరు చేశారు?.. ఎందుకు చేశారు?
అయితే కిడ్నాప్‌ ఎవరు చేశారు?, ఎందుకు చేశారనే విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సవాల్‌గా మారిన కేసు మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎస్‌బీ, క్రైం, ఐటీ కోర్‌ విభాగాలకు చెందిన ఐదుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 16 మంది ఎస్సైల నేతృత్వంలో 17 బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ‘క్రికెట్‌ బెట్టింగ్‌ ఏమైనా ఉందా? ప్రొఫెషనల్స్‌ చేశారా?, ఉద్దేశపూర్వకంగా చేశారా? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నారు.

కిడ్నాపర్‌ ‘రాజు’ కోసం ఆరా..
రాయవరం (మండపేట): కిడ్నాప్‌కు గురైన బాలుడు జసిత్‌ క్షేమంగా ఇంటికి చేరినా..పోలీసులు కిడ్నాపర్లను వేటాడే పనిలో పడ్డారు. కిడ్నాప్‌ చెర నుంచి బయట పడ్డ బాలుడు జసిత్‌ చెప్పిన మాటల ప్రకారం ‘రాజు’ అనే వ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించే క్రమంలో భాగంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. జసిత్‌ను వదిలిన ప్రాంతం రాయవరం మండలం లొల్ల గ్రామ పరిధిలో ఉండడంతో మండలంలోని లొల్ల, సోమేశ్వరం గ్రామాల్లో బాలుడ్ని దాచి ఉంటారనే అనుమానం పోలీసులను వెన్నాడుతోంది. బాలుడు చెబుతున్న మాటల ప్రకారం రాజు అనే వ్యక్తి తనను వదిలి వెళ్లాడని, కిడ్నాప్‌ అనంతరం తనను ఉంచిన ఇంట్లో ఒక ఆంటీ, ఒక బాబు కూడా ఉన్నట్టుగా జసిత్‌ తెలుపుతున్నాడు. దీని ప్రకారం రాజు అనే పేరు ఉన్న వ్యక్తి కోసం, జసిత్‌ను దాచి ఉంచిన ఇంటిని గుర్తించే పనిలో పోలీసులున్నారు. ముఖ్యంగా రాయవరం మండలం లొల్ల, సోమేశ్వరం గ్రామాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా రాజు అనే పేరు ఉన్న వ్యక్తుల ఇళ్లను గుర్తించి, జసిత్‌ చెబుతున్న మాటల ప్రకారం ఇళ్లను గుర్తించే పనిని చేపట్టనున్నట్టు సమాచారం.

త్వరలో నిందితులను పట్టుకుంటాం
నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. 20 బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నాం. వ్యక్తిగత కక్షలేమీ బయటపడలేదు. క్రికెట్‌ బెట్టింగ్‌ విషయమై కూడా విచారణ జరుగుతోంది. కాల్‌డేటా, అనుమానిత ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. అతి త్వరలోనే నిందితులను పట్టుకుని కోర్టుకు 
అప్పగిస్తాం.
– ఎస్‌వీ శ్రీధరరావు, అడిషనల్‌ ఎస్పీ  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

బాలుడుని సంరక్షించిన బట్టీలోని గదిని పరిశీలిస్తున్న పోలీసులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement